Minister Counter To MP: నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించిన సందర్భంగా తనపై ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ (Minister Counter To MP) రాశారు. నిజామాబాద్ రైతుల సుదీర్ఘ పోరాటం, చిరకాల నిరీక్షణ తర్వాత కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగానే కాక, ఒక రైతుగా నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిన అంశం ఇది. ఈ సందర్భంగా… పార్టీ, ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశాను.
ఈ సందర్భంగా నా రాజకీయ జీవితం గురించి మీరు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం…ఆక్షేపణీయం. ఈ స్థాయికి దిగజారి మీరు మాట్లాడతారని నేను ఊహించలేదు. నా రాజకీయ ప్రస్థానం పట్ల అవగాహన రాహిత్యమో, సమాచార లోపమో తెలియదు కానీ మీ వ్యాఖ్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. 1983 నుండి ఈ నాటి వరకు నా రాజకీయ జీవితం తెరచిన పుస్తకం. పదవుల కోసం, పార్టీ టికెట్ల కోసం ఏ నాడు, ఏ నాయకుడి వద్ద నేను మోకరిల్లింది లేదు. ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నది లేదు. 40 ఏళ్ల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రతిక్షణం ప్రజాహితమే తప్ప వ్యక్తిగత స్వార్థం లేదు.. ఇకపై ఉండబోదు కూడా!
Also Read: Gautam Gambhir: ప్రమాదంలో గౌతమ్ గంభీర్ కోచ్ పదవి.. ఛాంపియన్స్ ట్రోఫీలో రాణిస్తేనే!
ఆ నాడు నందమూరి తారక రామారావు లాంటి మహానుభావుడి నుండి నేడు రేవంత్ రెడ్డి వరకు ఏ కేబినెట్ లో పని చేసినా, ఏ హోదాలో విధులు నిర్వర్తించినా రాష్ట్ర అభివృద్ధి, రైతులు సంక్షేమం, పేదల పక్షపాతం తప్ప నాకు మరో ఎజెండా లేదు. చంద్రబాబు నాయుడు కావచ్చు… చంద్రశేఖర్ రావు కావచ్చు…రాజకీయంగా, సిద్ధాంత పరంగా నాతో విభేదించవచ్చు కానీ… ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల నా కమిట్ మెంట్ ను ప్రశ్నించలేదు. నాయకుడు ఎవరైనా, పార్టీ ఏదైనా ప్రజాహితమే నా అభిమతంగా పని చేశాను. నన్ను పార్టీలో చేర్చుకోండి, నాకు టికెట్ ఇవ్వండి, నాకు పదవి ఇవ్వండి అని ఈ 40 ఏళ్ల ప్రయాణంలో ఏనాడు, ఎవరిని అడిగింది లేదు. నా వల్ల సమాజానికి మంచి జరగుతుంది, నా పని తీరుతో రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని భావించి, విశ్వసించి ఆయా పార్టీలు, నాయకులు నన్ను కోరుకున్నారు, ప్రజలు ఆదరించారు తప్ప… నేను ఏ పార్టీ గుమ్మం ముందు, ఏ నాయకుడు వద్ద సాగిలపడింది లేదు.
మీరు మొదటి సారి ఎన్నికల్లో నిలబడినప్పుడు, ప్రజలకు రాసిచ్చిన బాండ్ పేపరు గురించి నేనెక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే అప్పుడు నేను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధం లేదు. తాజాగా నేను వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో జాతీయ పసుపు బోర్డు సాధించుకోవడం నా బాధ్యతగా భావించి కేంద్రంపై ఒత్తిడి తెస్తూ వచ్చాను. పసుపు బోర్డు ప్రకటించిన సందర్భంగా ప్రధాన మంత్రికి ధన్యవాదాలు తెలిపాను. దీంట్లో మీకున్న అభ్యంతరం ఏమిటి? మీ ఆవేదన, ఆక్రోశం దేని కోసం? బోర్డు ప్రకటన, ఏర్పాటు విషయంలో మీరు సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించలేదు. ఐనా రైతుల ప్రయోజనాల దృష్ట్యా మేం సంయమనం పాటించాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున బోర్డు ఏర్పాటు విషయంలో తగినంత సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఇదివరకే తెలియజేశాం. ఈ సమయంలో స్థాయి దిగజార్చుకుని మీరు మాట్లాడిన మాటలు సరైనవి కావు అని నేను భావిస్తున్నాను. రెండు పర్యాయాలు లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైన మీరు ఇంతటి అధమ భాషను వాడటం సభ్యత అనిపించుకోదు. పరిపక్వతలేని మాటలు మాట్లడకుండా, కొద్దిగా సహనంతో, రాజకీయ పరిజ్ఙానంతో మాట్లాడితే బాగుంటుందని హితవు పలుకుతున్నాను. మీ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ… వాటిని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని మంత్రి తుమ్మల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు లేఖ రాశారు.