Site icon HashtagU Telugu

Telangana : బంగారు తెలంగాణలో.. ధన కనక మద్య ప్రవాహం

In Golden Telangana.. The Flow Of Gold, Money And Alcohol

In Golden Telangana.. The Flow Of Gold, Money And Alcohol

By: డా. ప్రసాదమూర్తి

బంగారు తెలంగాణలో ఎటు చూసినా ధగధగల బంగారం బయటపడుతోంది. ఇదేదో పసిడి పంటల్లోనో.. సామాన్యుల బతుకుల్లోని అనుకుంటే పొరపాటు. కేజీల కొద్దీ బంగారం, వెండి, విమానాశ్రయాల్లోనూ రైల్వేస్టేషన్లోనూ, తెలంగాణ (Telangana) బోర్డర్ ప్రాంతాల్లోనూ పట్టుబడుతోంది. కోట్ల కోట్ల నోట్ల కట్టలు పుట్టల్లోంచి చీమలు బయటపడుతున్నట్టు పట్టుబడుతున్నాయి. ఇక మద్యం సీసాల మాటే వేరు. కోట్ల రూపాయల ఖరీదైన మద్యం తెలంగాణలోకి అన్ని సరిహద్దుల నుంచి హద్దులు లేకుండా ప్రవహిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై పది రోజులైనా దాటిందో లేదో తెలంగాణలో ఇదీ పరిస్థితి. ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికల్లో మనం చూశాం. ఒక ఓటు వేలల్లో పలికింది. మద్యం ఏరులై వొలికింది. వెండి బంగారాలు దండిగా కురిసాయి. అది కేవలం ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలకు మీడియా భాషలో చెప్పాలంటే ఒక ప్రోమో మాత్రమే. అసలు దృశ్యం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది కూడా కేవలం బిగినింగ్ మాత్రమే.

We’re now on WhatsApp. Click to Join.

ఇంకా 40 రోజులు గడవాలి. నవంబర్ 30 పోలింగ్ తేదీకి ముందు ఈ 40 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎంత డబ్బు చేతులు మారుతుందో.. ఎన్ని వేల కోట్ల రూపాయల విలువైన మద్యం, నగదు, వెండి బంగారాలు చేతులు మారతాయో తెలియదు. అసలే చాలీచాలని జీవితాలతో సతమతమయ్యే సామాన్యుడు ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగను నోట్ల పండుగగా భావించి ఆశగా ఎదురు చూస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ వారు బీఆర్ఎస్ పార్టీని నగదు మద్యం బంగారు పంపిణీకి కేరాఫ్ అడ్రస్ గా బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక నుంచి నగదు మద్యం కట్టలు పెంచుకొని ప్రవహించి తెలంగాణ (Telangana)లో ప్రవేశిస్తుందని అధికార బీఆర్ఎస్ పార్టీ వారు ఆరోపిస్తున్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ డబ్బు పంపకంలో, మద్యం బంగారం పంపకంలో పోటా పోటీగా తలపడుతున్నాయని బిజెపి విమర్శిస్తోంది. బిజెపి కూడా ఇందులో వెనకడుగు ఏమీ వేయడం లేదని తమ వంతు పంపిణీ కోసం భారీగా మొత్తాలను దిగుమతి చేస్తుందని ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. ఇలా మొత్తం మీద తెలంగాణలో ఎటు చూసినా నగదు, మద్యం, బంగారు, వెండి అధికారులకు పట్టుబడుతున్నాయి.

బుధవారం ఉదయం నుండి గురువారం ఉదయం వరకు 24 గంటల్లో 78 కోట్ల విలువైన మద్యం, వెండి, బంగారం, నగదు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు పట్టుబడింది 250 కోట్లు విలువ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఒక గురువారం రోజునే 10 కోట్ల పైన నగదు దొరికింది. ఇప్పటివరకు పట్టుబడిన నగదు మొత్తం 90 కోట్లకు చేరుకుంది. వెండి బంగారు వంటి విలువైన లోహాలు దాదాపు 120 కోట్ల విలువ చేస్తాయి. కేవలం ఒక్క రోజులోనే 60 కోట్లు విలువైన లోహాలు దొరికాయట. వీటిలో బంగారం వెండి తో పాటు విలువైన వజ్రాలు ఇతర లోహాలు కూడా ఉన్నాయి.

Also Read:  AP Governor – Chandrababu : ఏపీ హోంశాఖకు గవర్నర్ సంచలన ఆదేశాలు.. సీఐడీ చీఫ్, ఏఏజీ వ్యాఖ్యలపై దుమారం

2018 ఎన్నికల్లో అలా పట్టుబడిన నగదు మద్యం లోహాలు విలువ 111 కోట్ల వరకు ఉంది. అది మొత్తం ఎన్నికలలో అధికారులు స్వాధీనం చేసుకున్న చేసుకున్నది. కానీ ఇంకా ఎన్నికలకు 40 రోజులు సమయం ఉండగానే అధికారులు పట్టుకున్న మొత్తం 250 కోట్లకు పైనే దాటిపోయింది. ఇక ఈ 40 రోజులలో మరెంత మద్యం ఏరులై ప్రవహిస్తుందో.. ఎన్ని కోట్ల నోట్ల కట్టలు కుప్పలు తెప్పలుగా కురుస్తాయో.. ఎంత వెండి బంగారం వజ్రవైఢూర్యాలు తెలంగాణ (Telangana) నేల మీద మెరుపులు మెరిపిస్తాయో తెలియదు. దేశంలోనే అత్యధికంగా నగదు బంగారం మద్యం తెలంగాణ ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేయబడుతుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. ఎన్నికలంటే సామాన్యులకు కోటి ఆశలు కల్పించే ఒక ప్రజాస్వామిక పర్వదినం. ఇదొక అతి పవిత్రమైన రాజ్యాంగబద్ధమైన కార్యక్రమం. ఇందులో ప్రజలు తమకు కావలసిన నాయకులను నీతితో నిజాయితీతో నిబద్ధతతో ఎన్నుకోవాలి.

గత ప్రభుత్వాలు ఏం చేశాయి, లేదా కొత్తగా ప్రభుత్వంలోకి వస్తే ఎవరు ఏం చేస్తారు.. మొదలైన విషయాలను ఓటరు తన చిత్తశుద్ధితో విశ్లేషించుకుని తనకు కావలసిన పాలకులను ఎన్నుకుంటాడు. ఇలాంటి పవిత్రమైన రాజ్యాంగ ప్రక్రియను డబ్బుతో మద్యంతో వెండి బంగారాలతో అపవిత్రం చేసి మొత్తం ఎన్నికల ప్రక్రియనే ఒక ప్రహసనంగా మార్చేశారు. ఇక ఈ డబ్బు, మద్యం సృష్టిస్తున్న అల్లకల్లోలమైన వాతావరణంలో ఏ నిజాయితీపరులు,ఏ ప్రజాస్వామ్యవాదులు, ఏ నిస్వార్థపరులు ఎన్నికలలో స్వశక్తితో నిలబడగలరు? దొరికేది ఒకటో రెండో శాతం. దొరకని మొత్తమే 90 శాతం పైన ఉంటుంది. మరి వేల లక్షల కోట్ల రూపాయలు ఎన్నికల కోసం ఇలా నాయకులు ఖర్చు పెడుతున్నారంటే, అదంతా ఎక్కడి నుంచి వస్తున్నట్లు? పేదరికం ఇండెక్స్ లో, ఆకలి, పోషకాహారం ఇండెక్స్ లో మన దేశం ఎక్కడో అడుగున ఉంటుంది.

కానీ ఎన్నికలలో ప్రవహిస్తున్న డబ్బు మద్యం ఎండి బంగారాల కోలాహలంలో మాత్రం తప్పనిసరిగా మన దేశం ముందే ఉంటుందని చెప్పొచ్చు. డబ్బు పంచేవారు పంచుతున్నారు. పుచ్చుకునే వారు పుచ్చుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే ఇంకెంతకాలం ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టగలదు?, ఇలాంటి సమయంలోనైనా అందరూ స్వార్థాన్ని మరిచి ఆలోచించాలి. ఎన్నికల్లో ప్రజలకు పంచల్సింది డబ్బు కాదు నమ్మకాన్ని.

Also Read:  BRS Party: బీఆర్ఎస్ ఆకర్ష్, గులాబీ గూటికి అంబర్ పేట శంకర్