Site icon HashtagU Telugu

Congress Chintan Shivir: తెలంగాణ కాంగ్రెస్ చింతన్ శిబిర్ కార్యక్రమాల వివరాలు

Bhatti

Bhatti

తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేసుకోవడంతో పాటు భవిష్యత్తు ప్రణాళిక రూపొందించడానికి హైదరాబాద్ లోని కీసరలో రెండు రోజుల పాటు నవసంకల్ప్ చింతన్ శిబిర్ సమావేశాలు నిర్వహిస్తోంది.

పార్టీ బలోపేతం, ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కీసరలోని బాలవికాస్ వేదికగా, జూన్‌ 1, 2 తేదీల్లో తెలంగాణ కాంగ్రెస్ నవసంకల్ప్ చింతన్ శిబిర్ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ప్రకటించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండడంతో, అధ్యక్షుడు లేకుండానే ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల నిర్వహణ కమిటీకి చైర్మన్ గా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యవహరించగా మరో 33 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశాలకు మొత్తం 108 మందిని ఆహ్వానించారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిధిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ హాజరు కానున్నారు.

ఈ సమావేశాల్లో ఆరు అంశాలపై, ఆరు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వారి అభిప్రాయాలు తీసుకొని, మిగతా నేతలతో చర్చించి పలు అంశాలపై కాంగ్రెస్ ఒక పాలసీని రూపొందించుకోనుంది.

ఇటీవల కాంగ్రెస్ జాతీయ కమిటీ రాజస్థాన్ లో చేసిన చింతన్ శిబిర్‌లో చేసిన తీర్మానాలను ఈ సమావేశంలో ఆమోదించడంతోపాటు, రాష్ట్ర స్థాయి అంశాలు, సమస్యలపై రోడ్ మాప్‌ను సిద్ధం చేయనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో, మొదటి రోజు మొత్తం చర్చ ఉంటుంది. రెండోరోజు ప్రకటనలు, తీర్మాణాల ఆమోదం ఉంటుందని కమిటీ చైర్మన్ బట్టి తెలిపారు.

Exit mobile version