తెలంగాణ రాష్ట్రంలో దీపావళి పండుగకు కేవలం రెండు రోజుల ముందు వచ్చిన ‘రాష్ట్ర బంద్’ పిలుపు వ్యాపార వర్గాలను తీవ్రంగా ఆందోళనకు గురి చేసింది. సాధారణంగా పండుగలకు ముందు రెండు రోజులు మార్కెట్లలో కొనుగోలు ఉత్సాహం తారాస్థాయిలో ఉంటుంది. అయితే, ఈసారి బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు పండుగ వేళ వ్యాపార వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. రాష్ట్రవ్యాప్తంగా వస్త్రాలు, బంగారం, స్వీట్స్, గిఫ్ట్ వస్తువులు, డెకరేషన్ సరుకులు అమ్మకాలు ఉధృతంగా సాగుతాయని వ్యాపారులు భావించినప్పటికీ, బంద్ నేపథ్యంలో ప్రజలు బయటకు రావడానికి వెనుకంజ వేస్తున్నారు.
BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ
ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి పట్టణాల్లో శనివారం, ఆదివారం రోజులు దీపావళి షాపింగ్ పీక్స్‌గా మారతాయని వ్యాపారులు ముందుగానే భారీ స్టాక్ సిద్ధం చేసుకున్నారు. పండుగ సమయానికి వచ్చిన ఈ బంద్ వల్ల వాణిజ్య కార్యకలాపాలు స్థంభించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. “ఒకరోజు అమ్మకాలు తగ్గినా లక్షల్లో నష్టం వస్తుంది. ఈరోజే షాపింగ్ చేయాలనుకున్న కుటుంబాలు బంద్ భయంతో బయటకు రాకపోతే, పండుగ ముందు మా అమ్మకాలు పడిపోతాయి” అని ఒక వస్త్ర వ్యాపారి తెలిపాడు. మరోవైపు, బంద్ పూర్తిగా అమలు అవుతుందా లేదా అన్న దానిపై కూడా ఉదయం నుంచే స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.
ఇక ప్రభుత్వం, పోలీసులు బంద్ నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టగా, వ్యాపార వర్గాలు మాత్రం పండుగ సమయానికి ఇలాంటి రాజకీయ ఆందోళనలు ప్రజల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని అంటున్నారు. సాయంత్రానికి బంద్ ప్రభావం ఎంతమేరలో ఉందో అంచనా వేయవచ్చని అధికారులు తెలిపారు. బంద్ పూర్తిగా అమలు అయితే పండుగ షాపింగ్‌పై ప్రభావం తప్పదని స్పష్టమైంది. మరోవైపు, బీసీ సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం బంద్ అవసరమని చెబుతుండగా, ప్రజలు మాత్రం దీపావళి ఉత్సాహం మధ్య ఈ రాజకీయ ఉద్రిక్తత అవసరమా అన్న ప్రశ్నలు వేస్తున్నారు.