Site icon HashtagU Telugu

Ganesh Nimajjanam: హైదరాబాద్ లో 19,870 విగ్రహాలు నిమజ్జనం

Mumbai Ganesh Immersion

Mumbai Ganesh Immersion

హైదరాబాద్‌: నగరంలో గణేశ్‌ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. హుస్సేన్‌ సాగర్‌లో శుక్రవారం ఉదయం 6 గంటల వరకు 19,870 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. ఎల్బీనగర్‌ జోన్‌లో 3,150, ఖైరతాబాద్ జోన్‌లో 2,059 చార్మినార్‌ జోన్‌లో 983, కూకట్‌పల్లి జోన్‌లో 4,581, శేరిలింగంపల్లి జోన్‌లో 5,934 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు వెల్లడించారు. రేపటి వరకు చిన్నాచితక విగ్రహాల నిమజ్జన ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలిపారు.

కాగా హైదరాబాద్‌లో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనోత్సవాలు కొనసాగుతున్నాయి. హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో గురువారం మొదలైన సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. లిబర్టీ కూడలి వద్ద గణేశ్‌ విగ్రహాల వాహనాలు బారులు తీరాయి. బషీర్‌బాగ్ వైపు నుంచి వచ్చే వాహనాలతో పాటు.. నారాయణగూడ వైపు నుంచి వచ్చే శోభాయాత్రతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఫీవర్ ఆస్పత్రి నుంచి లిబర్టీ వరకు వాహనాలతో నిండిపోయాయి. పాతబస్తీ నుంచి వచ్చే శోభాయాత్రను వీలైనంత తొందరగా ముగించాలనే ఉద్దేశంతో పోలీసులు.. నారాయణగూడ వైపు నుంచి వచ్చే వాహనాలు చాలా సేపు నిలిపేశారు.

పాతబస్తీ నుంచి వచ్చే వాహనాలు ఎంజే మార్కెట్, ఆబిడ్స్, లిబర్టీ కూడలి మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు కదిలాయి. ఖైరతాబాద్ ఫ్లైఓవర్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి విగ్రహం వైపు నుంచి వాహనాల రాకపోకలను ఇప్పటికి అనుమతించలేదు. విగ్రహాలతో వచ్చిన వాహనాలన్నింటినీ నెక్లెస్ రోడ్డు వైపు మళ్లించిన తర్వాత ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా వాహనాలను అనుమతించనున్నారు.

Also Read: Gadar 2: బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన గదర్ 2, పఠాన్ రికార్డులు బద్ధలు