2024 Summer : తెలుగు రాష్ట్రాల్లో ఈసారి సమ్మర్ ఎలా ఉంటుందో తెలుసా ?

  • Written By:
  • Updated On - March 1, 2024 / 06:59 PM IST

2024 Summer : ఈ ఏడాది సమ్మర్ సీజన్ ఎలా ఉండబోతోంది ? భానుడు ఎలా ఉండబోతున్నాడు ? అనే దానిపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలకమైన అంచనాలను విడుదల చేసింది. ఈసారి ఎండలు ఆదిలోనే హై పిచ్‌లో ఉంటాయని పేర్కొంది. ఎల్‌నినో ఎఫెక్టుతో ఈ సమ్మర్‌లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనివల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని పేర్కొంది.   మార్చి నుంచి మే మధ్యకాలంలో దేశంలో అనేకచోట్ల సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర, మధ్య భారత్‌లో మాత్రం మార్చిలో వడగాలుల తీవ్రత ఉండకపోవచ్చని వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావం వేసవి సీజన్ ముగిసేదాకా కంటిన్యూ అవుతుందని.. ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని వివరించింది.

We’re now on WhatsApp. Click to Join

దేశంలో అనుకూల వర్షపాతానికి కారణమైన లా నినా (La Nina) పరిస్థితులు మాత్రం వర్షాకాలం సీజన్ మధ్య నుంచే ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ (2024 Summer) అంచనా వేసింది. మార్చి నెలలో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్‌-మేలో సార్వత్రిక ఎన్నికలు జరిగే టైంలో మన దేశంలో మండుటెండలు ఉంటాయని ఐఎండీ అంచనాలను బట్టి తేటతెల్లమైంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని అందరూ అంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉద‌యం 8 గంట‌ల‌కే భానుడు త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాడు. ఇంకా మార్చి నెల కూడా రాకముందే ఎండలు మండిపోతుండ‌డంతో ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. క్ర‌మ‌క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో దాదాపు 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32 నుంచి 37 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా నమోదవుతున్నాయి.

పెరిగిన ఉక్కపోత

మార్చి నెలలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం రాత్రి వేళల్లో కాస్త చలిగానే ఉన్నా.. పగటి పూట మాత్రం ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. గతేడాది ఇదే సమయంలో 15-20 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కానీ ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఎండాకాలం ప్రారంభంలోనే ఇంత ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే.. ఏప్రిల్‌, మే నెలల్లో ఎండలు మండిపోయే అవకాశం ఉంది.