Site icon HashtagU Telugu

Drones : వచ్చే వారం నుంచి ప్యాసింజర్ డ్రోన్స్ పరీక్షలు!

Passenger Drone

Passenger Drone

మినీ హెలికాప్టర్ ను తలపించేలా ఉండే తొలి ప్యాసింజర్ డ్రోన్ ను మరో వారం రోజుల్లో ఐఐటీ హైదరాబాద్ పరీక్షించనుంది. ఉమ్మడి మెదక్ జిల్లా కందిలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో దీన్ని ప్రయోగాత్మకంగా టెస్టు చేయనున్నారు. ఈవిషయాన్ని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ , ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రాజెక్టుపై కొంతమంది విద్యార్థులు, అధ్యాపకుల బృందం పనిచేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కేటాయించిన ప్రాజెక్టులో భాగంగా ప్యాసింజర్ డ్రోన్స్ అభివృద్ధిపై పని చేస్తున్నట్లు చెప్పారు. నేషనల్ మిషన్ ఫర్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ ఈ ప్రాజెక్టుకు సహాయ సహకారాలు అందిస్తోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కంపెనీలు, కాలేజీలు, విద్యా సంస్థల క్యాంపస్ లలో ప్యాసింజర్ డ్రోన్ల వినియోగం ప్రారంభం కావచ్చని వివరించారు. ప్రధానంగా మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు, కొండ చరియలు విరిగినప్పుడు సహాయక చర్యలు చేపట్టినందుకు ప్యాసింజర్ డ్రోన్స్ ఉపయోగపడతాయని తెలిపారు.