Warangal MP Kadiyam Kavya: తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) ఏర్పాటు చేయాలనే డిమాండ్ మరోసారి లోక్‌సభలో వినిపించింది. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య (Warangal MP Kadiyam Kavya) ఈ అంశాన్ని లేవనెత్తుతూ ఐఐఎం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని గుర్తుచేశారు. ఈ డిమాండ్‌పై కేంద్రం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు.
ఎంపీ కడియం కావ్య వాదనలు
MP కావ్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక వసతులు సిద్ధం చేసిందని తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఐఎస్బీ, ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయని, ఐఐఎం ఏర్పాటుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని ఆమె పేర్కొన్నారు.
Also Read: WTC 2025-27 Points Table: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ సమం.. డబ్ల్యూటీసీలో టీమిండియాకు లాభం!
యువతకు నాణ్యమైన విద్య: తెలంగాణలోని యువతకు మంచి మేనేజ్‌మెంట్ విద్య అవసరం. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పారిశ్రామిక, ఆర్థిక రంగాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరమని ఎంపీ నొక్కి చెప్పారు.
చట్టబద్ధమైన డిమాండ్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014, సెక్షన్ 93 ప్రకారం తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు. ఈ చట్టం వారసత్వ రాష్ట్రాల అభివృద్ధి కోసం కొన్ని సంస్థలను ఏర్పాటు చేయాలని సూచిస్తుంది.
కేంద్రం స్పందన, ఎంపీ అసంతృప్తి
ఎంపీ కడియం కావ్య ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ స్పందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఐఐఎం స్థాపనకు ఎటువంటి ప్రతిపాదన తమ వద్ద పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటికే 21 ఐఐఎంలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్రం సమాధానంపై డాక్టర్ కావ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశ్రామిక, స్టార్టప్ రంగాల డిమాండ్‌లను తీర్చడానికి తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు తప్పనిసరి అని, కేంద్రం ఈ విషయంలో పునరాలోచించాలని ఆమె కోరారు.