Basara IIIT: ఫుడ్ పాయిజనింగ్ : ఇంకా పూర్తిగా కోలుకోని బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్

రెండు వారాల క్రితం బాసర ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన వందలాది మంది విద్యార్థులు ఇంకా కోలుకోవాల్సి ఉంది.

  • Written By:
  • Publish Date - July 31, 2022 / 06:00 PM IST

రెండు వారాల క్రితం బాసర ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన వందలాది మంది విద్యార్థులు ఇంకా కోలుకోవాల్సి ఉంది. వారందరికీ చికిత్స కొనసాగుతోంది. ఫుడ్ పాయిజనింగ్ తో వివిధ ఆరోగ్య సమస్యల బారిన పడిన ఈ పిల్లలకు మెరుగైన చికిత్స అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం, కళాశాల యాజమాన్యం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జులై 15న వందలాది మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ తో ఆస్పత్రి పాలైనా
బాసర ట్రిపుల్ ఐటీ నిర్వాహక అధికారుల్లో చలనం లేదని అంటున్నారు. నాణ్యమైన ఆహారాన్ని అందించకపోవడం వల్లే ఇలా జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హన్మకొండకు చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థి విజ్ఞేష్ ఇంకా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. హన్మకొండలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో
విద్యార్థి విజ్ఞేష్ కు చికిత్స నడుస్తోంది. ఈ చికిత్స కోసం దాదాపు రూ.30వేలు ఖర్చు అవుతుందని ట్రిపుల్ ఐటీ బాసర పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ రాజేశ్వరి చెప్పారు. చికిత్సకు ఇంత పెద్ద ఖర్చు వచ్చినప్పుడు.. బాసర ట్రిపుల్ ఐటీ నిర్వాహక అధికారులే భరించాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఏటా రూ. 60 లక్షలు ఏం చేశారు?

నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం మరో నిర్వాకం బయటపడింది. గతేడాది సెప్టెంబర్ 1న ఇన్స్యూరెన్స్ పేరుతో అధికారులు ఒక్కో విద్యార్థి నుంచి రూ.700 చొప్పున వసూలు చేశారు. అయితే ఇన్స్యూరెన్స్ ప్రీమియం మాత్రం కట్టలేదు. ఇటీవల పుడ్ పాయిజన్ కారణంగా మృతి చెందిన విద్యార్థి సంజయ్ కిరణ్ తో పాటు అనారోగ్యానికి గురైన  స్టూడెంట్స్ పేరెంట్స్ నిలదీయడంతో నిర్లక్ష్యం బయటపడింది. ఇన్సూరెన్స్ చెల్లించలేదన్న విషయాన్ని  డైరెక్టర్ నిర్థారించారు. బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం ఇన్స్యూ రెన్స్ పేరిట విద్యార్థుల నుంచి ఏటా దాదాపు రూ.56 నుంచి 60 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రీమియం చెల్లింపు విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో యాజమాన్యం ఇన్నేళ్లుగా ఇన్స్యూరెన్స్ పేరుతో వసూలు చేసిన డబ్బుల లెక్క చెప్పాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.