తెలంగాణలో మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా కోహెడలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీని ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలు అందించి, వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని ఆయన ప్రకటించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఇస్తున్నామని తెలిపారు. త్వరలో ప్రతి మండలానికి క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.అయితే.. క్షేత్ర స్థాయిలో మహిళా సంఘాల సభ్యులకే చీరలు ఇస్తుండటం వలన.. రేషన్ కార్డు ఉన్నప్పటికీ కొందరు అర్హులకు అందక గందరగోళం నెలకొంది. పంపిణీ పారదర్శకంగా జరగాలని మహిళలు కోరుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ.. ముఖ్యంగా ఆడబిడ్డల ఆర్థిక స్వావలంబనపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించింది. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి.. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు ఈ చీరలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సిద్దిపేట జిల్లాలోని కోహెడలో జరిగిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలనే మహోన్నత లక్ష్యంతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. తెల్ల రేషన్ కార్డు కలిగి.. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఇందిరా మహిళా శక్తి పేరుతో చీరలను పంపిణీ చేస్తామని.. మహిళా సంఘంలోని మహిలళే ఇంటికి వచ్చి బొట్టు పెట్టి అందజేస్తారన్నారు. ఆడబిడ్డలకు ఏ కష్టం రానివ్వమని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ కార్యక్రమాలను వేగంగా ప్రారంభించిందని తెలిపారు.
మహిళా సంఘాలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు.. వారికి పది సంవత్సరాల పాటు వడ్డీలేని రుణాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా.. మహిళా సంఘాలు ఆర్థిక వృద్ధిని సాధించేందుకు వీలుగా పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకారం అందిస్తున్నామని వివరించారు. ఈ చీరల పంపిణీ అనేది పథకం మాత్రమే కాదని.. మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని, వారికి అందించే ‘సారే’ (బహుమతి)ని సూచిస్తుందని చెప్పారు. మహిళలు ఆర్ధికంగా ఎదిగి.. ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఇదిలా ఉండగా.. ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు అందిస్తామని ప్రకటించినప్పటికీ… క్షేత్ర స్థాయిలో కొన్ని గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల అధికారులు మహిళా సంఘంలో సభ్యత్వం ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తుండటం, రేషన్ కార్డు ఉన్నప్పటికీ సంఘంలో లేని అర్హులైన మహిళలకు చీరలు అందకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు మాత్రం.. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ చీరలు పంపిణీ చేయాలని స్పష్టం చేస్తున్నప్పటికీ.. పంపిణీ ప్రక్రియలో లోపాల వల్ల కొంతమంది అర్హులకు అన్యాయం జరుగుతోందని ఆయా గ్రామాల మహిళలు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి.. క్షేత్ర స్థాయిలో పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా.. సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని మహిళా లోకం కోరుతోంది.
