Bald Head: బట్టతల ఉంటే రూ.6వేల పెన్షన్ ఇవ్వాలి.. కొత్త డిమాండ్!

అన్ని వర్గాల అభివృద్ధి, స్వావలంబన కోసం ప్రభుత్వం రకరకాల పథకాలతో పాటు పలు పెన్షన్లను ప్రవేశ పెడుతుంది.

  • Written By:
  • Publish Date - January 6, 2023 / 09:34 PM IST

Bald Head: అన్ని వర్గాల అభివృద్ధి, స్వావలంబన కోసం ప్రభుత్వం రకరకాల పథకాలతో పాటు పలు పెన్షన్లను ప్రవేశ పెడుతుంది. అందులో భాగంగా దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు పెన్షన్లు ఇస్తుండటం తెలిసిందే. అయితే తాజాగా ఓ కొత్త డిమాండ్ తెర మీదకు వచ్చింది. బట్టతలతో బాధపడుతున్న వారందరికీ రూ.6వేలు పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్ ఇప్పుడు తెలంగాణలో ట్రెండ్ అవుతోంది.

బట్టతలతో బాధపడే వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, సంక్రాంతి లోపు రూ.6వేల పెన్షన్ ఇచ్చేలా చర్చలు తీసుకోవాలని బట్టతల బాధితుల సంఘం డిమాండ్ చేస్తోంది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తంగళ్లపల్లి గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ గుడిలో బట్టతల బాధితుల సంఘం సమావేశమైంది. ఈ సమావేశంలోనే బట్టతల బాధితుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది.

బట్టతల బాధితుల సంఘం అధ్యక్షులుగా వెల్ది బాలయ్య, ప్రధాన కార్యదర్శిగా రాజేశం, కోశాధికారిగా మౌటం రాములు ఎన్నికయ్యారు. సమాజంలో ఎంతో వివక్షకు గురవుతున్న తమ గురించి ప్రభుత్వం ఆలోచించాలని, తమను మానసిక వికలాంగుల కింద పరిగణించాలని బట్టతల బాధితుల సంఘం అధ్యక్షుడు వెల్ది బాలయ్య కోరారు. మానసిక వికలాంగుల కింద తమను పరిగణించడంతో పాటు నెలకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి లోపు బట్టతల బాధితులకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని బట్టతల బాధితుల సంఘం అధ్యక్షుడు వెల్ది బాలయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్ ను వెంటనే పరిశీలించి, సానుకూలంగా స్పందించాలని లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని కూడా బట్టతల బాధితుల సంఘం అధ్యక్షుడు వెల్ది బాలయ్య వివరించారు.