Site icon HashtagU Telugu

Secunderabad Station: వాళ్లు ఆ భవనాన్ని టార్గెట్ చేసి ఉంటే.. నెల రోజులు సికింద్రాబాద్ స్టేషన్ బంద్!

Secunderabad Station

Secunderabad Station

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళనకారులు ఆ భవనాన్ని కనుక టార్గెట్ చేసి ఉంటే.. నెల రోజులపాటు రైళ్ల రాకపోకలను బంద్ చేయాల్సి వచ్చేది. అదే ఆర్ఆర్ఐ భవనం. సికింద్రాబాద్ స్టేషన్ రైల్వే నిర్వహణ వ్యవస్థ అంతటికీ ఆ భవనమే కీలకం. ఇది కనుక ధ్వంసమై ఉంటే.. నెల రోజులపాటు సిగ్నలింగ్ వ్యవస్థ కుప్పకూలేది. ఎందుకంటే సికింద్రాబాద్ స్టేషన్ ఐదు మార్గాలతో అనుసంధానమై ఉంటుంది. అందుకే రోజూ దాదాపు 150 రైళ్ల రాకపోకలు ఉంటాయి. ఆ రైళ్లన్నీ వచ్చివెళ్లేటప్పుడు మాన్యువల్ గా ట్రాక్ లు మార్చాలంటే అసాధ్యం. అప్పుడు కచ్చితంగా కొన్ని రైళ్లను రద్దు చేయాల్సి వచ్చేది. అదృష్టవశాత్తూ అలాంటి ప్రమాదం ఏదీ జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్ఆర్ఐ భవనం సమీపానికి వెళ్లారు. కానీ అక్కడి నుంచి మళ్లీ వెనక్కు వచ్చేశారు. ఒకవేళ ఆ బిల్డింగ్ ను కనుక లక్ష్యంగా చేసుకుని ఉంటే మాత్రం ఇంతటి విధ్వంసం తప్పేది కాదు. నాంపల్లి, మల్కాజగిరి, కాచిగూడ. లింగంపల్లి, సీతాఫల్ మండి.. ఈ ఐదు మార్గాల మీదుగా సికింద్రాబాద్ స్టేషన్ కు పలు రైళ్లు వచ్చిపోతుంటాయి.

సికింద్రాబాద్ స్టేషన్ లో మొత్తం 10 ప్లాట్ ఫామ్ లు ఉన్నాయి. వీటిమీదుగా రాకపోకల కోసం ట్రాక్ ను అనుసంధానించడం అంటే అదంతా గజిబిజిగా ఉంటుంది. సామాన్యులకు అసలదేమీ అర్థం కాదు. అందుకే రైలు ఏ ప్రదేశంలో ట్రాక్ మారాలో.. డైరెక్షన్ మార్చుకోవాలో అన్న అంశాన్ని టెక్నికల్ స్టాఫ్ అంతా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. దీనికోసం పూర్తిగా టెక్నాలజీనే ఉపయోగిస్తారు. ఈ పనుల కోసం ఆర్ఆర్ఐ.. అంటే రూట్ రిలే ఇంటర్ లాకింగ్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ అంతా కంప్యూటర్ కమాండ్స్ ను బట్టి డీటైల్స్ ని డిస్ ప్లే చేస్తుంది. రైళ్లు ఎక్కడ ట్రాక్ మారుతున్నాయో అన్నీ కంప్యూటర్ లో ఫీడ్ అవుతాయి. దీనికోసం జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే చాలు.. పనంతా సులభంగా జరిగిపోతుంది. ఇలాంటి ఆర్ఆర్ఐ భవనం సమీపానికి వెళ్లిన ఆందోళనకారులు తిరిగి వెనక్కి వచ్చేశారు. అందుకే అధికారులు ఊపిరి పీల్చుకోగలిగారు.

Exit mobile version