Site icon HashtagU Telugu

KTR CM : కేటీఆర్ ప‌ట్టాభిషేకంపై దోబూచులాట‌! `ముంద‌స్తు`కు ముడి!

KTR CM

Ktr

సంక్రాంతి త‌రువాత ఏ రోజైన కేటీఆర్ సీఎం(KTR CM) కుర్చీ ఎక్కే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఒక వేళ ముంద‌స్తు ఎన్నిక‌ల(Before Election) లేక‌పోతే కేటీఆర్ (KTR)ప‌ట్టాభిషేకం ముహూర్తం ప‌క్కా అంటూ పార్టీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. ప్ర‌స్తుతం జాతీయ రాజ‌కీయాల్లో బిజీగా మారిన కేసీఆర్ రాబోవు రోజుల్లో కేటీఆర్ కు రాష్ట్ర బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్నారని తెలుస్తోంది. భార‌త రాష్ట్ర స‌మితి(బీఆర్ఎస్) ను దేశ వ్యాప్తంగా విస్త‌రింప చేసే ప‌నిలో కేసీఆర్ ఉన్నారు. ఢిల్లీ కేంద్రంగా పార్టీ ఆఫీస్ ను ఈనెల 14న ప్రారంభించిన త‌రువాత దేశ వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో పార్టీ కార్యాల‌యాల‌ను ప్రారంభించ‌బోతున్నారు. ఆ త‌రువాత ప్ర‌తి రాష్ట్రంలోనూ బ‌హిరంగ స‌భ‌లు పెట్ట‌డానికి రూట్ మ్యాప్ త‌యారు చేసుకున్నారు. ఆ క్ర‌మంలో తెలంగాణ పాల‌న మీద ఆయ‌న దృష్టి పెట్ట‌డానికి టైమ్ దొర‌కడం క‌ష్టం. అందుకే, సీఎంగా కేటీఆర్ ను ప్ర‌క‌టించ‌డానికి సిద్ధం అవుతున్నారా? అంటే సంక్రాంతి త‌రువాత ఏదో ఒక రోజు ఆ ముహూర్తం ఉంటుంద‌నే గులాబీ నేత‌లు లేక‌పోలేదు.

ఎన్నిక‌ల క‌మిష‌న్ నుంచి బీఆర్ఎస్ కు అనుమ‌తులు వ‌చ్చిన త‌రువాత అధికారికంగా ఆ పార్టీని ఆవిర్భవించిన రోజు కూడా కేటీఆర్ ప్రాధాన్య‌త‌ను కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర బాధ్య‌త‌ల‌ను కేటీఆర్ కు అప్పగించేలా సంకేతాలు ప‌రోక్షంగా ఇచ్చారు. ఇక జాతీయ రాజ‌కీయాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యే అవ‌కాశం ఉంద‌న్న సంకేతం కేసీఆర్ ఇచ్చారు. ఆ రోజు నుంచి కేటీఆర్ ఇప్ప‌టికిప్పుడు సీఎం అవుతారా? వ‌చ్చే ఎన్నిక‌ల త‌రువాత సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? అనే అంశం తెర‌మీదకు వ‌చ్చింది. ఒక వేళ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు(Before election)వెళ్ల‌డానికి ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఢిల్లీ కేంద్రంగా ఉంటే సంక్రాంతి త‌రువాత ఏ రోజైనా కేటీఆర్ సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌ని తెలుస్తోంది. ముంద‌స్తుకు అనుకూలంగా ఈసీ నుంచి సానుకూల‌త ఉంటే మాత్రం ఎన్నిక‌ల త‌రువాత మాత్ర‌మే కేటీఆర్ సిఎం అవుతారా? లేదా అనేది తేలుతుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బీజేపీ దూకుడుగా ఉంది. ఫ‌లితంగా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం పెద్ద‌గా లేక‌పోవ‌డంతో కేటీఆర్ అభిమానులు మాత్రం ఇప్పుడే సీఎం కుర్చీ ఎక్కాల‌ని కోరుకుంటున్నారు.

కేసీఆర్, కేటీఆర్ కు మ‌ధ్య వ్య‌త్యాసం

ప‌రిపాల‌న‌, రాజ‌కీయాల‌ను న‌డ‌ప‌డంలో కేసీఆర్, కేటీఆర్ కు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంది. సీఎం కేసీఆర్ దాదాపుగా ఎవ‌ర్నీ క‌ల‌వ‌రు. ఆయ‌న అభిప్రాయాల‌ను షేర్ చేసుకోరు. మంత్రులకు కూడా ఆయ‌న్ను క‌లుసుకునే అవ‌కాశం ల‌భించడం బ‌హు అరుదు. కానీ, మంత్రిగా ఉన్న కేటీఆర్ మాత్రం త‌న సొంత టీమ్ ను త‌యారు చేసుకున్నారు. ఏ ప‌ని ఉన్నా, వెంట‌నే వాళ్ల‌కు ఫోన్ చేస్తారు. వాళ్లు కూడా కేటీఆర్ కు అందుబాటులో ఉంటారు. నిత్యం ఏదో ఒక ప‌ని మీద సొంత మ‌నుషుల‌తో కేటీఆర్ ట‌చ్ లో ఉంటారు. ప్ర‌త్యేకించి తెలంగాణ వ్యాప్తంగా జ‌రిగిన భూ ఆక్ర‌మ‌ణ‌ల్లోనూ కేటీఆర్ పేరు చెప్పుకుని సెటిల్మెంట్ లు చేసే వాళ్లు చాలా మంది ఉన్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఏపీ మూలాలున్న వాళ్లు ఎక్కువ‌గా కేటీఆర్ టీమ్ లో ఉన్నారు. కొన్ని వంద‌ల ఎక‌రాల వివాద‌స్ప‌ద‌ భూముల‌కు క్లీన్ చిట్ తీసుకోవ‌డానికి మంత్రి కేటీఆర్ పేరును ఉపయోగించుకున్న వాళ్లు తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది ఉన్నార‌ని ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఆ టీమ్ అంతా కేటీఆర్ ఇప్ప‌టికిప్పుడు సీఎం అయితే బాగుటుంద‌న్న భావ‌న‌తో ఉన్నారని వినికిడి.

గ‌త కొన్ని రోజులుగా క‌ల్వంకుంట్ల కుటుంబం ఆస్తుల మీద ఈడీ, సీబీఐ, ఐటీ చుక్కాని వేసి వెదుకుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రి కేటీఆర్, క‌విత‌, సంతోష్ త‌దిత‌రుల మీద ఇచ్చిన ఫిర్యాదులపై అన్వేష‌ణ ప్రారంచాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌తో పాటు ప్ర‌జా, పౌర సంఘాలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు మంత్రి కేటీఆర్ బినామీల మీద క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ సంపద అంతా కేసీఆర్ కుటుంబం మింగేసిందని కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తోంది. కానీ, ఇప్పటికీ బలమైన ఆధారాలు ప్రజల ముందు ఉంచలేకపోయారు. కాళేశ్వరం ‘ఏటీఎం’ అని చెబుతున్నా.. ఏడాదిగా ఎక్కడా నిరూపించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం బయటపెట్టారు. కానీ, ఇక్కడ ధరణీ భాగోతం ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం లేదు. రియల్ ఎస్టేట్ స్కాంలు అంటున్నా, అది పార్టీలన్నింటికీ ఆదాయం పెంచే మార్గమేనని అంటున్నారు. ప్రైవేట్ ఆస్తుల పెరుగుదల ఉంటే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. భారీ స్కాంలకు పాల్పడ్డారని ఇప్పటికీ సరైన విధంగా బయటపెట్టడంలో విపక్షాలు విఫలమవుతున్నాయి. ఒకరిద్దరూ ఫైట్ చేసినా ‘క్లీన్ చిట్’ వస్తోందని సమాచారం. అందుకే, కేటీఆర్ ను సీఎంగా ప్ర‌తీష్టించాల‌ని అనుచ‌రుల డిమాండ్‌.

కేటీఆర్ ముఖ్యమంత్రి కావ‌డంపై

ప్ర‌స్తుతం మారిన ప‌రిణామాల దృష్ట్యా కేటీఆర్ ముఖ్యమంత్రి కావ‌డంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. జాతీయ రాజకీయల పైన కేసీఆర్ ఫోకస్ చేస్తూనే, పార్టీ అధ్యక్షుడిగా, ప్రభుత్వానికి సలహాలిచ్చే చట్టబద్ధ సంఘానికి చైర్మన్‌గా ఉంటారంటూ పార్టీలోని సీనియర్ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఈసారి కేటీఆర్ కు పట్టాభిషేకం ఖాయమనేది కేసీఆర్ ఇటీవ‌ల చేసిన‌ వ్యాఖ్యల సారాంశమంటూ కేటీఆర్ అనుచ‌రుల అంచ‌నా వేస్తున్నారు.