Kalvakuntla Kummudu: వినేవాళ్ళు ఉంటే ‘కల్వకుంట్ల’ కుమ్ముడే..!

ఒక వ్యక్తి నేరం చేస్తే వ్యవస్థకు ఆపాదిస్తే ఎలా? అంటూ విపక్షాల మీద మంత్రి కేటీఆర్ చేసిన రాజకీయ దాడి. ఇదే సూత్రరీకరణ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా..

  • Written By:
  • Updated On - March 18, 2023 / 01:43 PM IST

ఒక వ్యక్తి నేరం చేస్తే వ్యవస్థకు ఆపాదిస్తే ఎలా? అంటూ విపక్షాల మీద మంత్రి కేటీఆర్ చేసిన రాజకీయ దాడి. ఇదే  సూత్రీక‌ర‌ణ‌ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు కూడా వర్తిస్తుందని మరిచారా? తెలంగాణ ప్రజలు ఏది చెప్పినా వింటారని భ్రమలో ఉన్నారా? అనేది ఆసక్తికరం. ఎందుకంటే టీ ఎస్ పీ ఎస్ పేపర్ లీక్ కుంభకోణం ఐటీ మంత్రిగా ఆయన వైపు మళ్లింది. విపక్షాలు కేటీఆర్ రాజీనామాను డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు సిట్ తేల్చిన నేరగానితో ఆయన ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. కల్వకుంట్ల (Kalvakuntla) కుటుంబంతో  నేర‌గానికి ఉన్న సంబంధాన్ని విపక్షాలు బయట పెట్టే క్రమంలో ఫొటోలు విడుదల చేసారు. ఆ సందర్భంగా ఒక నేరగాని తప్పు వ్యవస్థకు ఆపాదిస్తారా? అంటూ కేటీఆర్ చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితను ఈడీ అరెస్ట్ చేయటానికి ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో ఆమె నేరాన్ని తెలంగాణకు ముడి పెట్టి బీ ఆర్ ఎస్ రోజులుగా గేమ్ ఆడుతుంది. ఆ నేరాన్ని తెలంగాణ సమాజానికి సంబంధించి ఉన్నట్టు ఫోకస్ చేశారు. ఢిల్లీ వేదికగా ఇదే నినాదాన్ని బలంగా వినిపించడానికి అనేక వ్యూహాలు పన్ను తున్నారు. ఇక్కడ కవిత చేసిన నేరాన్ని వ్యవస్థకు మాత్రమే కాదు తెలంగాణ సమాజానికి నిసిగ్గుగా ఆపాదిస్తూ పేపర్ లీక్ కుంభకోణం మాత్రం వ్యక్తిగత నేరంగా కేటీఆర్ చెబుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలు ఏది చెప్పినా వింటారు అనే భ్రమలో ఇంకా ఉన్నారు. గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రోళ్లు అంటూ సెంటిమెంట్ ను రంగరించి ఆస్తులు, అంతస్తులు పోగేసుకున్న కల్వకుంట్ల (Kalvakuntla) కుటుంబం ఇంకా తెలంగాణ సమాజాన్ని మోసం చేయాలని చూస్తుందని విపక్షాలు చెబుతున్నాయి.అందుకు తగిన విధంగా తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇంకా సెంటిమెంట్ ను వినిపిస్తూ లబ్ది పొందాలని ప్రయత్నించటం శోచనీయం.

ప్రజాసమస్యల మీదనో,మరేదైనా న్యాయమైన అంశాల విషయంలో ప్రస్తావించటం ద్వారా పెద్ద ఇబ్బందులు ఉండవు. అందుకు భిన్నంగా సొంత ప్రయోజనాల కోసం చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసం సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేస్తే ఆ విషయాలు వెంటనే బయటకు వచ్చేస్తాయి. గతంలో మీడియా మాత్రమే ఉండేది. విషయాలు కాస్త ఆలస్యంగా బయటకు వచ్చేవి. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. మీడియా చెప్పని ఎన్నో అంశాల్ని సోషల్ మీడియాలో బయటకు వచ్చేస్తున్నాయి. ఇలాంటి వేదికలు ఉన్న వేళలో సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేసినంత మాత్రాన తాము అనుకున్నది జరగదన్నది మర్చిపోకూడదు. తెలంగాణ మీద దాడి, తెలంగాణ ప్రజల హక్కుల మీద దాడికి తెలంగాణ పాలకులుగా వ్యవహరిస్తున్న కేసీఆర్ అండ్ కోకు ఎదురయ్యే సవాళ్లు ఏవీ తెలంగాణతో సంబంధం ఉన్నవి కాదన్నది మర్చిపోకూడదు.

ఈ విషయంలో కేసీఆర్ అండ్ కో ఒకలా ఆలోచించొచ్చు కానీ తెలంగాణ ప్రజలు మాత్రం వారు అనుకున్నట్లుగా ఆలోచిస్తారని అనుకుంటే పొరబాటు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత, ఈడీ తనకు ఇచ్చే నోటీసులను తన మీద జరిగే వ్యక్తిగత దాడిగా రాజకీయంగా తమ కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లుగా చెప్పుకోవటం వల్ల తమ మీద సానుభూతి అలల మాదిరి వచ్చి పడుతుందనుకోవటం అవివేకం అవుతుందన్న విషయాన్ని గులాబీ బాస్ గ్రహించాలి. సెంటిమెంట్ ను అస్త్రంగా చేసుకొన్న కేసీఆర్ మాత్రం గడిచిన కొన్నేళ్లుగా రాజకీయాల్ని చేస్తూ.. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తన అధీనంలో ఉంచుకునేలా చేయటం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సెంటిమెంట్ ను రగిలించి.. అధికారంలోకి రావటమే కాదు.. పదేళ్లుగా అధికారపీఠం మీద కూర్చొని పాలిస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రాంతీయ సెంటిమెంట్ ను ఎన్నిసార్లు ప్రయోగించినా అంతో ఇంతో వర్కువుట్ అవుతుంది. ఎప్పుడైతే అధికరాంలోకి వస్తారో.. అప్పటి నుంచి సెంటిమెంట్ ను ఆచితూచి అన్నట్లుగా వినియోగిస్తున్నారు.ఇది ప్రతిసారి పనిచేస్తుందని తెలంగాణ ప్రజల నాడిని పెట్టేసిన కల్వకుంట్ల (Kalvakuntla) కుటుంబం భ్రమలో ఉంది. అందుకే పేపర్ లీక్ కేసును ఒక విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును మరో విధంగా ఫోకస్ చేస్తూ తెలంగాణా సమాజాన్ని ఉపయోగించు కుంటూ సెంటిమెంట్ మీద కొట్టే ప్రయత్నం మొదలు పెట్టారు. కానీ అదే సెంటిమెంట్ దెబ్బ వేస్తుందని మరిచారని విపక్షాల అభిప్రాయం.

Also Read:  TSPSC Group I : TSPC గ్రూప్ I ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు