Site icon HashtagU Telugu

MLC Kavitha : మూసీలో కూల‌గొట్టిన ఇళ్ల‌కు ఈఎంఐలు చెల్లిస్తారా.. సర్కారుకు ఎమ్మెల్సీ క‌విత‌ ప్రశ్న

Brs Mlc Kavitha Musi Demolished Houses Emis

MLC Kavitha : మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్‌డీ‌సీఎల్) ద్వారా తయారవుతున్న సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్‌)పై  శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక కామెంట్స్ చేశారు. మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో కూల‌గొట్టిన ఇళ్ల‌కు ఈఎంఐలు డ్యూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా అని ఆమె ప్రశ్నించారు.  మూసీ నదీ గర్భంలో నివసించే 309 కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేసి వాళ్లంతట వాళ్లే వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతుండటం నమ్మశక్యంగా లేదన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు సంబంధించిన హృదయవిదారక వీడియోలను చూస్తుంటే.. కాంగ్రెస్ సర్కారు చెబుతున్నవన్నీ అబద్ధాలే అనిపిస్తోందని కవిత(MLC Kavitha) కామెంట్ చేశారు. ‘‘ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయిన 309 కుటుంబాలు.. స్వచ్ఛందంగా వెళ్లిపోతున్నట్లుగా తెలుపుతూ ఏవైనా పత్రాలపై సంతకాలు చేసి ఉంటే అవి సభకు అందించాలి’’ అని రాష్ట్ర సర్కారును ఆమె కోరారు. మొత్తం 309 బాధిత కుటుంబాల్లో 181 కుటుంబాలు తామంతట తామే ఇళ్లను కూల్చేసుకొని వెళ్లిపోయారని రాష్ట్ర సర్కారు చెబుతుండటాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారని విమర్శించారు. మూసీ నిర్వాసితుల విషయాన్ని మానవీయ కోణంలో చూడాలని ప్రభుత్వాన్ని కవిత కోరారు.

Also Read :One Nation One Election : లోక్‌సభ ఎదుటకు జమిలి ఎన్నికల బిల్లులు.. కేంద్రంపై విపక్షాలు ఫైర్

మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్‌డీ‌సీఎల్) ద్వారా డీపీఆర్ చేస్తున్నామ‌ని మంత్రి శ్రీధర్ బాబు శాస‌న‌మండ‌లిలో ప్ర‌స్తావించ‌గా.. పలు కీలక ప్రశ్నలను కవిత లేవనెత్తారు. ‘‘మూసీ నది విషయంలో డీపీఆర్ ఆధారంగా అంచనా వ్యయాలు ఉంటాయని కాంగ్రెస్ సర్కారు అంటోంది. కానీ రూ. 4100 కోట్ల అప్పు కోసం ప్రపంచ బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతోంది. ఇది నిజమా ? కాదా ? మీరే చెప్పండి’’ అని ఆమె నిలదీశారు.  ‘‘ఓవైపు  మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై డీపీఆర్ తయారు కాలేదని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు దీని కోసం ప్రపంచ బ్యాంకు సాయం కోసం ప్రతిపాదనలు పంపించింది. ప్రభుత్వం ప్రజలకు నిజమేంటో చెప్పాలి’’ అని కవిత డిమాండ్ చేశారు. ‘‘మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ. 14,100 కోట్లు అవుతుందని, నిధులతో పాటు అనుమతులు ఇప్పించాలని ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ఏ ప్రాతిపదికన అడిగారు ? కనీసం ఇదైనా నిజమా కాదా చెప్పాలి’’ అని ఆమె అడిగారు. నిజాలను దాస్తూ సభను తప్పదోవ పట్టిస్తే ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెడతామని కవిత తేల్చి చెప్పారు.

Also Read :Shock To Russia : రష్యాలో కలకలం.. ‘న్యూక్లియర్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌’ అధిపతి హత్య