KTR: లోక్‌సభ బరిలో కేటీఆర్‌, కేసీఆర్ ఆదేశిస్తే పోటీకి సై!

  • Written By:
  • Updated On - January 7, 2024 / 01:24 PM IST

KTR: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన సికింద్రాబాద్, లేదా మల్కాజిగిరి నుంచి బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఇదే అంశంపై చర్చ వచ్చినప్పుడు కేటీఆర్ సానుకూలత చూపలేదట. అలా అని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోను అని కూడా స్పష్టంగా చెప్పలేదట. చివరకు కేసీఆర్ తీసుకునే తుది నిర్ణయంపై కేటీఆర్ లోక్‌సభ ఎన్నికల బరిలో ఉంటారా లేదా అన్నది తేలనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కేటీఆర్‌ లోక్‌సభ బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయనీ బీఆర్ఎస్‌లోని ఉన్నతస్థాయి వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అధిక స్థానాల్లో ఓటమి పాలువ్వడంతో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ముఖ్యనేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటోంది. కాగా.. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 17 స్థానాలకు గాను బీఆర్ఎస్‌ 9 చోట్ల గెలిచింది. 4 చోట్ల బీజేపీ.. కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలిచింది. ఎంఐఎం లోక్సభ స్థానాన్ని దక్కించుకుంది. కాగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో 7 స్థానాలకు గాను ఆరు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలిచింది.

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని దీమా ఉంటే.. ఊహించని రీతిలో సీట్లు తగ్గిపోయాయి. అయితే.. కొద్ది నెలల్లోనే లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం అవుతోంది. గత ఎన్నికల్లో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. ఈ సారి ముందుకు రావాలని చూస్తోంది. దాంతో.. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపే ప్రయత్నాలను మొదలుపెట్టింది.

కేసీఆర్‌ కోలుకుంటున్నారని, ఫిబ్రవరి నుంచి ఆయన సం పూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు వస్తారని, జిల్లాల్లో పర్యటిస్తారని, తెలంగాణ భవన్‌కొచ్చి కార్యకర్తలను కలుస్తారని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమి స్పీడ్‌ బ్రేకర్‌లాంటిది మాత్రమేనని, అభివృద్ధి చేసినా దుష్ప్రచారం వల్లే ఓడిపోయామని చెప్పారు. భవిష్యత్తులో మళ్లీ మంచిరోజులొస్తాయని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం.. కేసీఆర్‌ కిట్‌ మీద ఉన్న కేసీఆర్‌ గుర్తును చెరిపేస్తోందని, కిట్‌ మీద నుంచి తొలగించవచ్చేమోకానీ.. తెలంగాణ ప్రజల గుండెల నుంచి మాత్రం తొలగించలేరని అన్నారు.