Site icon HashtagU Telugu

Bandi Sanjay: కేసీఆర్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే చంద్ర‌మండ‌లం కూడా ఖ‌తమే: బండి సంజయ్

కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తగ్గేదేలే అంటూ కేసీఆర్ కుటుంబంపై నిత్యం ఆరోపణలు చేస్తుంటారు. అయినా బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నా.. కేసీఆర్ కుటుంబానికి విమర్శించకుండా ఉండలేకపోతున్నారు. తాజాాగా మరోసారి బండి సంజయ్ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.  కేసీఆర్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే చంద్ర‌మండ‌లం కూడా ఖ‌తం అవుతుంద‌న్నారు. చంద్రుని మీద కూడా భూములిస్తామ‌ని కేసీఆర్ మాయ మాట‌లు చెబుతార‌ని ఆయ‌న తనదైన స్టైల్ లో మాట్లాడారు.

ఇదిలా వుండ‌గా కేసీఆర్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సీట్ల‌లో స‌గం మందికి బీ ఫారాలు ద‌క్క‌వ‌ని ఆయ‌న అన్నారు. కేసీఆర్ ప్ర‌క‌టించిన‌వ‌న్నీ ఉత్తుత్తి సీట్లే అని ఆయ‌న విమ‌ర్శించారు. కేసీఆర్ ఒక‌రికి సీటు ఇచ్చి, మ‌రొక‌రిని ఇంటికి పిలిపించి మాట్లాడుతున్నార‌ని చెప్పుకొచ్చారు. కేసీఆర్ బిడ్డ‌కు సీటు ఇస్తే మ‌హిళ‌ల‌కు 33 శాతం ఇచ్చిన‌ట్టేనా అని ఆయ‌న నిల‌దీయడం గ‌మ‌నార్హం. మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌, బీసీల గురించి మాట్లాడే హ‌క్కు కేసీఆర్‌కు లేద‌ని ఆయ‌న అన్నారు. గ‌తంలో కవిత ఢిల్లీ వేదిక‌గా మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు కోసం పోరాటం చేస్తున్న‌ట్టు బిల్డ‌ప్ ఇచ్చార‌ని, బీఆర్ఎస్ టికెట్ల‌లో మాత్రం మ‌హిళ‌ల‌కు త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని బండి సంజయ్ ఆరోపించారు.

ఇటీవల చేవెళ్ల (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ బూత్ సమ్మేళనంలో పాల్గొన్న బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాన్సర్ వ్యాధి కంటే డేంజర్ అని అన్నారు. మొదటిసారి అధికారంలోకి వచ్చి మోసం చేశాడని.. రెండోసారి అధికారంలోకి వచ్చి భూములన్నీ అమ్మేసి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాడని.. మూడోసారి వస్తే ఇక అంతేనని అన్నారు. క్యాన్సర్ మూడో దశకు చేరితే ఎంత డేంజరో.. కేసీఆర్ సీఎం అయితే అంతకంటే డేంజర్ అని అన్నారు. ప్రజలు ఆలోచించాలని కోరారు. కేసీఆర్ దంతా పెగ్గుల భాగోతమే తప్ప.. ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని సెటైర్లు వేశారు. ప్రస్తుతం బండి సంజయ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Also Read: Shocking: ఇదేమీ ఆచారం.. ఆ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించడం నిషేధం, ఎందుకో తెలుసా!