Hyderabad: చినుకు పడితే టెన్షనే.. ట్రాఫిక్ జాం తో సిటీ జనం బేజార్!

అర కిలోమీటర్ ప్రయాణానికే గంట సమయం పడుతుంది. దీంతో సిటీ జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

  • Written By:
  • Updated On - November 24, 2023 / 12:22 PM IST

గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం కురవడంతో ఐటీ కారిడార్‌, సికింద్రాబాద్‌, అంబర్‌పేట్‌, మెహదీపట్నం, ముషీరాబాద్‌, కూకట్‌పల్లి, హిమాయత్‌నగర్‌ సహా నగరంలోని కీలక జంక్షన్‌లలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. కుండపోత వర్షం కారణంగా హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గుముఖం పట్టాయి. క్యాబ్ రేట్లు ఆకాశాన్ని తాకాయి. మెట్రో రైల్ స్టేషన్‌లు పెద్ద సంఖ్యలో జనాలతో రద్దీగా మారుతున్నాయి. చిన్నపాటి వర్షానికే కిలోమీటర్ల ట్రాఫిక్ నిలిచిపోతోంది. అర కిలోమీటర్ ప్రయాణానికే గంట సమయం పడుతుంది. దీంతో సిటీ జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

శీతాకాలం ప్రారంభమైన తర్వాత హైదరాబాద్‌లో తొలి వర్షం కురిసింది. బాలానగర్‌, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో అత్యధికంగా 5.3 మి.మీ, పటాన్‌చెరు (4.8 మి.మీ), రాజేంద్రనగర్‌ (4.5 మి.మీ), ఖైరతాబాద్‌, మల్కాజిగిరి, రామచంద్రపురం (4.3 మి.మీ.) వర్షపాతం నమోదైంది. TS డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం.. నవంబర్ 26-27 వరకు ముఖ్యంగా మధ్య తెలంగాణ నుండి తూర్పు ప్రాంతాల వరకు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నగరంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున ఓ మోస్తరు వర్షం కురిసింది.

ఉదయం 9 గంటలకు ప్రారంభమైన వర్షం, ఆంధ్రప్రదేశ్ తీరం నుండి పశ్చిమ మరియు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా ఉంది. ప్రస్తుతం, తూర్పు నుండి తక్కువ ఎత్తులో వీచే గాలులు మొత్తం వర్షపాతాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే పోలీసులు ఎన్నికల హాడావుడిలో ఉండటం, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించకపోవడంతో జనాలు ఇబ్బందులు పడ్డారు.