హైదరాబాద్‌లో శాంతియుత వాతావరణం నెలకొనాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించాల్సిందేనని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో సోమవారం (ఏప్రిల్ 21న) మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ఉగ్రవాదం కంట్రోల్‌లోకి వచ్చిందని పేర్కొన్నారు. మోదీ ప్రధానమంత్రి కాకముందు దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నా, ఇప్పుడు ఉగ్రవాదులు దేశం వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడుతున్నారని ఈటల చెప్పారు.
Raj Kasireddy: ఏపీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి అరెస్ట్!
నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో స్మార్ట్ సిటీలుగా మారే ప్రగతి జరుగుతోందని ఈటల వివరించారు. అమృత్ నగరాలు, మోడర్న్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు కేటాయిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌లో కూడా ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకమని వివరించారు.
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి ఓటు వేయడం వల్ల శాంతిభద్రతలు దెబ్బతింటాయని, అభివృద్ధి కూడా అడ్డుకుపోతుందని ఈటల రాజేందర్ ఆరోపించారు. “ఎంఐఎం పార్టీకి ఓటు వేయడం అంటే మన చేతులతో మన కంట్లోనే పొడుచుకున్నట్లుగా అవుతుంది” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటు వేసే ముందు ఓటర్లు సరిగా ఆలోచించాలన్నారు. హైదరాబాద్ నగరానికి భవిష్యత్తు రూపుదిద్దాలంటే బీజేపీకి మద్దతు అవసరమని పిలుపునిచ్చారు.
ఈ నెల 23న హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 112 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 81 మంది కార్పొరేటర్లు కాగా, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి మెజారిటీ ఓట్లు ఉండగా, బీజేపీ రెండో స్థానంలో ఉంది. ఎన్నికల ఫలితాలు ఏప్రిల్ 25న వెలువడనున్నాయి. ఈ ఎన్నికలు హైదరాబాద్ రాజకీయాల్లో కీలక మలుపును తీసుకురావచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.