Site icon HashtagU Telugu

CM Revanth: రైతుల ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు: సీఎం రేవంత్

Telangana TET 2024

Telangana TET 2024

CM Revanth: రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్స్లు రద్దు చేయాలని, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్లో పెట్టాలని సీఎం ఆదేశించారు. సీఎంతో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సమీక్షించారు.

కొన్ని చోట్ల తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, అందుకే ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆరబెట్టాలని ముఖ్యమంత్రి రైతులకు విజ్ఞప్తి చేశారు. నేరుగా కళ్లాల నుంచి వడ్లను మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని.. ఒకటి రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మంచి రేటు పొందాలని సీఎం సూచించారు. ధాన్యం ఆరబెట్టేందుకు మార్కెట్ యార్డుల్లోనే తగిన ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వడ్ల దొంగతనం జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని సూచించారు.