MLC Kavitha: జైళ్లో పెట్టుకుంటారా.. పెట్టుకోండి: కవిత రియాక్షన్!

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టుపై తన పేరు రావడంపై టీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత

  • Written By:
  • Updated On - December 1, 2022 / 11:32 AM IST

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టుపై తన పేరు రావడంపై టీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయని, అందుకే నరేంద్ర మోదీ కంటే ముందుగానే రాష్ట్రానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వచ్చిందని ఆమె అన్నారు.

తనపై, ఎమ్మెల్యేలు, మంత్రులపై కేసులు పెడుతున్నారని, ఇది రాజకీయ వ్యూహంలో భాగమని కవిత ఆరోపించారు. బీజేపీ చీప్ ట్రిక్స్‌కు పాల్పడుతోందని కవిత అన్నారు. తొమ్మిదేళ్లలో ఎనిమిది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను పడగొట్టిందని, ఇకనైనా తన పంథాను మార్చుకోవాలని మోదీని కవిత విమర్శించారు. ఈడీ, సీబీఐలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ప్రజలు మాతో ఉండే వరకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో ప‌లువురు రాజ‌కీయ నేత‌లు, ప్ర‌ముఖుల పాత్ర‌పై కీల‌క విష‌యాల‌ను ఈడీ వెలుగులోకి తీసుకువ‌స్తుంది. ఈ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రిమాండ్ రిపోర్టులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరుని వెల్ల‌డించింది. రిమాండ్ రిపోర్టులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు, బడ్డీ రిటైల్ డైరెక్టర్ అమిత్ అరోరా ఈ కుంభకోణానికి సంబంధించిన కొన్ని వివరాలను వెల్లడించారు.

32 పేజీల నివేదికలో కవిత పేరును పేర్కొనడంతోపాటు, ఆమె పది మొబైల్ ఫోన్‌లు మార్చిన‌ట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రకారం.. ఆప్ నాయకుల తరపున ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ నాయర్ సౌత్ కార్టెల్ గ్రూప్ నుండి 100 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించారని.. సౌత్ కార్టెల్ గ్రూప్‌ను కవిత, అరబిందో ఫార్మాకు చెందిన శరత్ రెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రిస్తున్నారని ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. అంతేకాకుండా, 2021, 2022లో కవిత తన మొబైల్ ఫోన్‌ను ఆరుసార్లు మార్చారని నివేదిక పేర్కొంది. డిజిటల్ సాక్ష్యాలను కూడా పెద్ద ఎత్తున ధ్వంసం చేశారని ED ఆరోపించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని ఎమ్మెల్సీ ఇటీవలి కాలంలో ఖండించారు.

కవిత కీలక వ్యాఖ్యలు

ఎనిమిది ఏళ్లలో తొమ్మది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు

తెలంగాణలో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, మోడీ కంటే ముందు ఈడీ రావడం సహజం

ఎన్నికలకు ముందు ఈడీలతో సోదాలు చేయించడం కామన్

టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయించడం, బీజేపీ నీచ రాజకీయ ఎత్తుగడ

ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెబుతాం

ఈడీలకు, సీబీఐలకు భయపడేది లేదు

జైల్లో పెట్టడం కంటే, ఎక్కువ చేసేది ఏమి లేదు

మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పంధాన్ని మార్చుకోవాలి

తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు