మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (komatireddy Rajagopal Reddy) అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సమయంలో, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో తాను అసెంబ్లీకి కాకుండా ప్రజల మధ్య ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అందువల్ల ఈరోజు సభ ప్రారంభం కావడంతో అసెంబ్లీకి వచ్చానని, కానీ రేపటి నుంచి తాను అసెంబ్లీకి రానని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వరద కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం వచ్చిందని, అసెంబ్లీలో కాకుండా ప్రజల మధ్య ఉండడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
కామారెడ్డి ప్రాంతంలో వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, తన అనుచరులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించి వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరించారు. ఈ నిర్ణయం వల్లే తాను మళ్లీ అసెంబ్లీకి రానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి పదవిపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరికైనా పదవి శాశ్వతం కాదని, సేవ చేయాలనే గుణం, మంచి వ్యక్తిత్వమే శాశ్వతమని పేర్కొన్నారు. పదవులు వస్తాయని, పోతాయని, కానీ సేవా గుణం మరణించే వరకు ఉంటుందని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేగా కాకుండా ఒక వ్యక్తిగా ప్రజలకు సహాయం చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వమే అన్నీ చేయాలని అనుకుంటే సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు అసెంబ్లీ వద్ద తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. అనుచరుల బల ప్రదర్శన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకవైపు రాజగోపాల్ రెడ్డి పదవి శాశ్వతం కాదని వ్యాఖ్యానించగా, మరోవైపు ఆయన అనుచరులు మాత్రం తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.