Site icon HashtagU Telugu

Eatala On KCR: కేసీఆర్ పై పోటీకి ఈటల సై!

Etala

Etala

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియానుద్దేశించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ తీరుపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని ఈటల అన్నారు. ఆ పార్టీని కూకటివేళ్లతో పెకలించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. దళితులు,గిరిజనులతోపాటు అన్ని వెనుకబడిన వర్గాల వారిని కేసీఆర్‌ మోసం చేశారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కేసీఆర్)ను ఓడించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బిజెపి నాయకుడు సువేందు అధికారి విజయం సాధించిన సీన్ గజ్వేల్‌లో పునరావృతం అవుతుందని ఈటల అన్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో జులై 15 నుంచి జరగనున్న రెవెన్యూ సమావేశాలతో భూ సంబంధిత సమస్యలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కసారి పరిష్కరించేలా చూడాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం పేరుతో కేసీఆర్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిందని ఆయన తప్పుబట్టారు.