Site icon HashtagU Telugu

CM Revanth Reddy : రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానిని కలిశా : సీఎం రేవంత్‌ రెడ్డి

I met the Prime Minister only for the interests of the state: CM Revanth Reddy

I met the Prime Minister only for the interests of the state: CM Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్రాల సీఎంలకు ప్రధాని నరేంద్రమోడీ పెద్దన్న లాంటివారని ఆయన్ను తాను కలవడంలో రాజకీయం ఏముందని ప్రశ్నించారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని మోడీని కలిశానని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని, కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడతాయని.. అందువల్ల కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాలన్నారు. ప్రధానిని గౌరవించే విజ్ఞత మాది. రాజకీయాలకు వచ్చినప్పుడు నేను కాంగ్రెస్‌ నేతను.. ఆయన బీజేపీ నాయకుడు. అవరసమైతే మహేశ్వర్‌రెడ్డిని ఢిల్లీ తీసుకెళ్తాం. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని నాలుగు సార్లు కలిశాం. నిర్మలాసీతారామన్‌, అమిత్ షాలను కూడా కలిశాం అని సీఎం తెలిపారు.

Read Also: Bandla Ganesh : బండ్ల గణేష్ ట్వీట్..మెగా బ్రదర్ పైనేనా..?

ప్రపంచ దేశాలతో పోటీపడేలా నగరాన్ని నిర్మించాలని చూస్తే అడ్డం పడుతున్నారు. పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామంటే అడ్డుపడుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ సలహాలు, సూచనలిస్తే పాటించేందుకు సిద్ధంగా ఉన్నాం. అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన చెప్పినవి పాటిస్తాం. చెరువులు, కుంటలను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తుంటే అనవసరంగా గగ్గోలు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. లెక్క లేకుండా అనుమతులిచ్చి నగరంలో గందరగోళం సృష్టించారని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. కమీషన్లు తీసుకొని హైదరాబాద్‌ నగరాన్ని సర్వనాశనం చేశారని సీఎం విమర్శించారు. చెరువులు, కుంటలు మాయం చేశారన్నారు. అపార్ట్‌మెంట్‌లకు తగినట్లు డ్రైనేజీ వ్యవస్థ లేకుండా పోయిందన్నారు.

డిస్కంలు, సింగరేణి, కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌ పెట్టి వెళ్లిపోయారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు మాపై వేశారు. రూ.1.52 లక్షల కోట్లు అప్పు చేశామని మాపై బురద జల్లుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ అప్పు రూ.7,38,707 కోట్లు. అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడపాలని అనుకోవడం లేదు. ప్రజలే మా బాసులు.. నన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన ప్రజలకు నేను జవాబుదారిగా ఉండాల్సిన బాధ్యత నాపై ఉంది అని సీఎం వివరించారు. అప్పులు పెండింగ్‌లో పెట్టి పారిపోతే మేము కట్టుకుంటున్నాం. కేసీఆర్‌ పాలనలో తప్పులు.. అప్పులే చేశారు. ఈ 15 నెలల కాలమంతా కేసీఆర్‌ చేసిన అప్పులు, తప్పులు సరిచేయడానికే సరిపోయింది. వాళ్లు పెట్టిన అప్పులకు వడ్డీలు కట్టడమే భారంగా ఉంది. అప్పులు పెట్టింది కాకుండా తిరిగి మాపైనే విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

Read Also: CM Revanth : వాళ్లకు కరెంట్, నీళ్లు కట్ – సీఎం రేవంత్ హెచ్చరిక