Site icon HashtagU Telugu

Konda Murali : నాకు ప్రజాబలం ఉంది..చాలా కేసులకే నేను భయపడలేదు: కొండా మురళి

I have the power of the people..I am not afraid of many cases: Konda Murali

I have the power of the people..I am not afraid of many cases: Konda Murali

Konda Murali: కాంగ్రెస్ నేత కొండా మురళి ఆయన తన సతీమణి, రాష్ట్ర మంత్రి కొండా సురేఖతో కలిసి హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలుసుకున్నారు. ఉమ్మడి వరంగల్ పరిసరాలలో ఏర్పడుతున్న రాజకీయ పరిణామాలపై ఆమెకు నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ.. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధినిగా ప్రజల కోణంలో పనిచేస్తున్నానని, వారికి సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. నేను ఎప్పుడూ బీసీల కోణంలో ఉండే నాయకుడిని. ప్రజలు నన్ను నమ్మి దగ్గరకు వస్తున్నారు. సమస్యల పరిష్కారమే నాకు ప్రధానంగా కనిపిస్తోంది. పని చేసేవారిపై రాళ్లు వేయడం మన సమాజంలో సాధారణం. నడిచే ఎద్దునే పొడుస్తారు అనే మాట గుర్తు పెట్టుకోవాలి. ఎవరికైనా పార్టీ టికెట్ ఇవ్వొచ్చు, కానీ గెలిపించే బాధ్యతను నేనే తీసుకుంటానని మీనాక్షి నటరాజన్‌ గారికి చెప్పాను.

Read Also: PM Modi : ఘనా అత్యున్నత పురస్కారంతో మోడీ సత్కారం: భారత-ఘనా బంధానికి కొత్త అధ్యాయం

మా సేవలను పార్టీ వినియోగించుకోవాలని కోరా. కాంగ్రెస్ పార్టీ బతికించడమే నా లక్ష్యం. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నది నా ఆశయం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరో పదేళ్లు కొనసాగాలని కోరుకుంటున్నాను. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు నా సంపూర్ణ మద్దతు ఉంది అని తెలిపారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిర్వహించబోయే సభపై కూడా చర్చించామని పేర్కొన్నారు. వరంగల్ నుండి ఎంతమంది కార్యకర్తలు ఆ సభకు హాజరవుతారో వంటి అంశాలపై వివరంగా చర్చించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా తనవంతు కృషి చేస్తానని చెప్పారు. మళ్లీ వరంగల్‌లో ఎమ్మెల్యేలను గెలిపించడమే నా బాధ్యత. నాకు ఎవరిపట్ల భయం లేదు. ఎలాంటి గ్రూపు రాజకీయాలనైనా నేను పట్టించుకోను అని స్పష్టం చేశారు.

ఇక, మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ..తనకు అప్పగించిన శాఖల పరంగా నిబంధనల ప్రకారమే పని చేస్తున్నానని తెలిపారు. నా శాఖలో ఉన్న అన్ని ఫైల్స్‌ను పరిశీలించవచ్చు. ఇప్పటివరకు మంత్రిగా నేను ఎలాంటి తప్పు చేయలేదు. నా కూతురు సుష్మితలో పారేది కొండా మురళి, కొండా సురేఖ రక్తం. ఆమెకు మా ఆలోచనలు వంశపారంపర్యంగా రావడంలో తప్పు లేదు. ఆమె రాజకీయ ఆలోచనలు తప్పు కాదని నమ్ముతున్నా. భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయం తీసుకునే హక్కు ఆమెదే. పార్టీ తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తాం అని స్పష్టం చేశారు. అయితే ఇటీవల కొండా మురళి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వరంగల్‌కు చెందిన నాయకులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనను గాంధీభవన్‌కు పిలిపించి వివరణ కోరింది. అనంతరం లిఖితపూర్వక వివరణ కోసం షోకాజ్ నోటీసును కూడా జారీ చేసింది. ఈ వివరణలో ఆయన చెప్పిన అభిప్రాయాలను పీసీసీ పరిశీలించనుంది. ఈ క్రమంలో కొండా దంపతులు, పార్టీలో తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ, సేవకే ప్రాధాన్యతనిస్తూ, కాంగ్రెస్ పునరుద్ధారణ కోసం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. వారిద్దరి తాజా వ్యాఖ్యలు పార్టీలో వారి పాత్రను మరింత ప్రాధాన్యంగా చూపిస్తున్నాయి.

Read Also: Amarnath Yatra 2025 : ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర..కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు