తన హెలికాప్టర్ పర్యటన(Helicopter Tours)లపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టత ఇచ్చారు. ప్రజల అవసరాలపై స్పందన అందించడానికి, అధికార పనులను వేగంగా పూర్తి చేయడానికి హెలికాప్టర్ వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. “హెలికాప్టర్ ఒక అవసరం. షో కోసం కాదు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వమే ఈ హెలికాప్టర్లను లీజుకు తీసుకుందని, ప్రస్తుత ప్రభుత్వానికి అదనంగా వచ్చే ఖర్చు కేవలం ఫ్యూయల్ ఖర్చేనని తెలిపారు.
హెలికాప్టర్ గంటకు సుమారు మూడు వందల లీటర్ల ఫ్యూయల్ అవసరం. లీటర్‌కు సుమారు వంద రూపాయల ధర ఉండగా, రాష్ట్రంలోని ఎక్కడికైనా వెళ్లాలంటే ఒక లక్ష నుండి లక్ష యాభై వేల రూపాయల ఖర్చు అవుతుందని వెల్లడించారు. అయితే ఇదే ప్రయాణాన్ని రోడ్డుమార్గంలో చేస్తే పోలీసు బందోబస్తు, కాన్వాయ్ ఖర్చులు, అధిక సమయం అన్నీ కలిసి మరింత ఖర్చులు అవుతాయని అన్నారు. ముఖ్యంగా ప్రజల సమస్యలపై సమీక్షలకు వెళ్లే సమయంలో హెలికాప్టర్ ప్రయాణం అనివార్యమని పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల సమీక్షకు ఆఫ్ డే లో కూడా హెలికాప్టర్‌లో వెళ్లినట్లు గుర్తు చేశారు. రోడ్డుమార్గం ఎంచుకుంటే నాలుగు రోజుల సమయం పడుతుందని, అదే సమయంలో హెలికాప్టర్‌తో ఒకే రోజు పని పూర్తయ్యే అవకాశం ఉంటుందన్నారు. “మంత్రులుగా మేము ముగ్గురు, నలుగురు కలిసి ఒక్కో కార్యక్రమానికి వెళ్తున్నాం. ఇది ప్రజల పనుల తక్షణ పరిష్కారానికి చేస్తున్న చర్య” అని ఉత్తమ్ స్పష్టం చేశారు. విస్తృత పర్యటనలు చేసి పని చేస్తున్నామన్న అసూయతోనే ఆరోపణలు చేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు.