Site icon HashtagU Telugu

Bathukamma Kunta : మళ్లీ జీవం పోసుకున్న “బతుకమ్మ కుంట”

Schools

Hydra Bathukamma Kunta

హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఎన్నో చెరువులు కాలానుగుణంగా కబ్జా కోరల్లో చిక్కుకుని కనుమరుగవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ హైడ్రా (Hydraa) ను తీసుకొచ్చి..కబ్జాలకు గురైన చెరువులకు మోక్షం కల్పిస్తున్నారు. ఈ తరుణంలో బతుకమ్మ కుంట(Bathukamma Kunta)ను తిరిగి పునరుద్ధరించేందుకు హైడ్రా తో పాటు హైదరాబాద్ మున్సిపల్ అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు కృషి చేస్తున్నారు. ఇటీవల బతుకమ్మ కుంట పరిసరాలను పరిశీలించిన అధికారులు, అక్కడ డ్రైనేజ్ పైపు లైన్లు లేవని నిర్ధారించారు. కుంటకు తాగునీటి పైపు లైన్లు లేకపోవడం, అక్కడ వచ్చే నీరు వూట నీరుగా గుర్తించడం ద్వారా, ఇది పూడికతో నిండిపోయిన చెరువే అని స్పష్టం చేసారు.

SC classification : ఎస్సీ వర్గీకరణ కమిషన్ గడువు పెంపు

కబ్జాలు, పట్టణ విస్తరణ కారణంగా నిర్లక్ష్యానికి గురైన ఈ కుంట, మట్టి తొలగింపు ప్రక్రియలో మళ్లీ తన ఆనవాళ్లను బయటపెట్టుకుంది. 250 మీటర్ల దూరంలో ఉన్న పైపుల ద్వారా నీరు రాకపోయినా, లోతట్టు ప్రాంతం కావడంతో వర్షపు నీరు చేరే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. చెరువు పునరుద్ధరణ కోసం చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మోకాళ్ల లోతు మట్టిని తొలగించగానే చెరువుకు చెందిన ఆనవాళ్లు స్పష్టంగా బయటపడటం, పూడిక తీయడం ద్వారా జలకళ సంతరించుకుంటుందనే ఆశను పెంచింది.

ఇక హైదరాబాద్ నగర జలవనరుల పరిరక్షణ కోసం చేపడుతున్న “హైడ్రా” ప్రాజెక్ట్ ద్వారా, పురాతన చెరువులను, కుంటలను రక్షించేందుకు ప్రభుత్వ రంగం కృషి చేస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించినట్లుగా, నగరంలోని జలవనరులను భవిష్యత్ తరాలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ చర్యల ద్వారా, బతుకమ్మ కుంట వంటి అనేక చెరువులు తమ మునుపటి మహిమను పొందే అవకాశం ఉంది. పూడిక తీయడం పూర్తయిన తర్వాత, బతుకమ్మ కుంట తన పూర్వ వైభవాన్ని పొందుతుందని స్థానికులు ఆశిస్తున్నారు.