హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల పాలిట సింహస్వప్నంగా మారిన ‘హైడ్రా’ (HYDRAA) మరో భారీ ఆపరేషన్‌తో వార్తల్లో నిలిచింది. ఐటీ కారిడార్‌లోని అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించింది. హైదరాబాద్‌లోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల సంరక్షణే ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా అధికారులు తాజాగా శేరిలింగంపల్లి మండలంలోని ఖానామెట్ గ్రామంలో భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఐటీ హబ్‌కు ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 55లో దాదాపు 8.20 ఎకరాల ప్రభుత్వ భూమిని బడా రియల్ ఎస్టేట్ సంస్థల ఆక్రమణ నుంచి విడిపించారు. బహిరంగ మార్కెట్‌లో ఈ భూమి విలువ సుమారు రూ.1200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కబ్జాదారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లను, నిర్మాణాలను బుల్డోజర్లతో నేలమట్టం చేసి, సదరు భూమిలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.
బడా సంస్థల కబ్జా.. రంగంలోకి హైడ్రా కమీషనర్
ఈ ఆక్రమణల వెనుక పేరున్న నిర్మాణ సంస్థల హస్తం ఉండటం గమనార్హం. మీనాక్షి, వాసవి వంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ భూమిని తమ ఆధీనంలో ఉంచుకుని ఆర్‌సీసీ ప్లాంట్లు, కార్మికుల షెడ్లు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. మరికొంత భూమిని కొలను సబిత అనే వ్యక్తి తనదేనంటూ క్లెయిమ్ చేస్తూ బౌన్సర్లను సైతం కాపలా పెట్టినట్లు ఫిర్యాదులు అందాయి. హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో రెవెన్యూ మరియు ఇతర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఇది నిషేధిత జాబితాలో ఉన్న అసైన్డ్ ల్యాండ్ అని నిర్ధారించిన తర్వాతే ఈ కఠిన చర్యలు చేపట్టారు.
కబ్జాదారులకు గట్టి హెచ్చరిక
హైడ్రా కేవలం పేదవాడి గుడిసెలకే పరిమితం కాకుండా, వందల కోట్ల విలువైన భూములను ఆక్రమించిన బడా బాబుల భరతం పడుతుండటం నగరంలో చర్చనీయాంశమైంది. గతంలోనూ ఇదే సర్వే నంబర్‌లో 11 ఎకరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, తాజాగా మరో 8 ఎకరాలను రక్షించి ప్రభుత్వ ఆస్తిని కాపాడారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే అది ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఈ ఆపరేషన్ ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపారు. భవిష్యత్తులో కూడా హైడ్రా తన దాడులను కొనసాగిస్తూ, ఆక్రమణలకు గురైన ప్రతి గజం భూమిని వెలికితీసేందుకు సిద్ధమవుతోంది.
