తెలంగాణ రాష్ట్రంలోని చెరువులు, ప్రభుత్వ భూములు, పర్యావరణ సంపదను రక్షించేందుకు గత సంవత్సరం జూలై 19న ప్రారంభమైన హైడ్రా (HYDRA) సంస్థ తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. అంబర్‌పేట బతుకమ్మ కుంట వద్ద నిర్వహించిన ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు కాదని, అది అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు ప్రతీక అని స్పష్టం చేశారు.
హైడ్రా కార్యకలాపాల్లో కీలకమైన లక్ష్యం చెరువుల రక్షణ. గత ఏడాది నుంచీ 500 ఎకరాలకుపైగా చెరువులు, ప్రభుత్వ భూములను అక్రమ కబ్జాల నుండి కాపాడటం ద్వారా దాదాపు రూ.30,000 కోట్ల విలువైన ఆస్తులను రాష్ట్రానికి తిరిగి అందించగలిగారు. ఇది ప్రజల సహకారంతో సాధ్యమైందని, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ అసెట్స్ ప్రొటెక్షన్‌పై ప్రత్యేక దృష్టితో పని చేస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు. ముఖ్యంగా పేదల ఇళ్లను కూల్చకుండా, కేవలం అక్రమ కబ్జాలు చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
AP Liquor Case : మిథున్ రెడ్డి అరెస్ట్ తో జగన్ త్వరలో అసలు సినిమా చూడబోతున్నాడా..?
బతుకమ్మ కుంట పునరుద్ధరణ కార్యక్రమం హైడ్రా చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్టుగా నిలిచింది. సెప్టెంబర్ 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించనున్నారు. ఇదే రోజున బతుకమ్మ ఉత్సవాలు కూడా జరగనున్నాయి. ఇంకా కొన్ని ప్రాజెక్టులు సామాజిక కోణంలో పరిశీలనలో ఉన్నాయని, సల్కాం చెరువు, ఒవైసీ ఫాతిమా కాలేజీ భవనాలపై తుది నోటిఫికేషన్ రావాల్సి ఉందని రంగనాథ్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 140 చెరువులకు తుది నోటిఫికేషన్ వెలువడినట్లు తెలిపారు.
హైడ్రా కేవలం అభివృద్ధి దిశగా కాకుండా పర్యావరణ పరిరక్షణలోనూ విశేష కృషి చేస్తోంది. చెరువులు, పార్కులు, రహదారులు, నాలాలపై అక్రమ ఆక్రమణలను అడ్డుకునే చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వివరించారు. ఈ సందర్భంగా రవీంద్రభారతిలో పాఠశాల విద్యార్థులచే ఏర్పాటు చేసిన సామాజిక, పర్యావరణ అంశాలపై ప్రదర్శనను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ప్రకృతి పరిరక్షణ కోసం ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం అని, హైడ్రా ముందుగా ఒక ఉద్యమంగా మారితేనే భవిష్యత్ తరాల కోసం ఆరోగ్యకరమైన జీవనవాతావరణం అందించగలమని ఆయన సందేశమిచ్చారు.