Site icon HashtagU Telugu

Hydraa – Home Loan : బాధితుల హోమ్ లోన్స్ ను ‘హైడ్రా’ మాఫీ చేయబోతుందా..?

Hydra Homelone

Hydra Homelone

‘హైడ్రా’ రంగనాధ్ (Hydra Ranganath)..ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాలలో మారుమోగిపోతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల యజమానులకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. చెరువులు, బఫర్ జోన్స్, ఎఫ్ టీఎల్, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తుంది హైడ్రా. పేదలు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా నిబంధనలకు విరుద్దంగా స్థలాలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను బుల్డోజర్లతో పడగొడుతున్నది. హైడ్రా చర్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. అయితే హైడ్రా కూల్చివేతలకు మొదట్లో పలు వర్గాల నుంచి మద్దతు లభించినప్పటికీ..ప్రస్తుతం మాత్రం పూర్తి వ్యతిరేకత వస్తుంది.

పొలిటికల్ లీడర్స్ , సంపన్నులకు నోటీసులు ఇస్తూ..ఖాళీ చేసేందుకు టైం ఇస్తున్న హైడ్రా..సామాన్య ప్రజల వద్దకు వచ్చేసరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తుందని..కనీసం ఇంట్లో సామాన్లు తీసుకెళ్తామన్న కూడా కుదరదంటూ కూల్చేస్తూ తమను రోడ్డు మీదకు లాగుతున్నారని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వమే అన్ని పర్మిషన్లు ఇచ్చి..డబ్బు తీసుకోని మళ్లీ అదే ప్రభుత్వం అక్రమ నిర్మాణమని కూల్చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ముందే అది అక్రమ నిర్మాణమని చెపితే మీము కొనుగోలు చేయం కదా..లక్షలు..లక్షలు బ్యాంకు లోన్లు తెరుచుకొని , ఇల్లు కట్టుకుంటే..ఇప్పుడు ఆ ఇంటిని కూల్చేస్తే ఆ లోన్ లు ఎలా కట్టుకోవాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఈక్రమంలో హైడ్రా కూల్చివేతల వేళ బాధితులకు తీపికబురు అందబోతున్నట్లు సమాచారం అందుతోంది.

హైడ్రా కూల్చివేసిన ఇళ్లకు సంబంధించిన హోమ్ లోన్స్ మాఫీ అయ్యేలా బ్యాంకర్లతో హైడ్రా చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. హోమ్ లోన్స్ పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ బ్యాంకర్లతో మీటింగ్ జరుపనున్నట్లు టాక్. చెరువుల, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలకు లోన్స్ ఇచ్చేటప్పుడు బ్యాంక్ అధికారులు జాగ్రత్త పడాలని హైడ్రా సూచించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఏ డాక్యూమెంట్స్ ఆధారంగా లోన్స్ ఇచ్చారు. లీగల్ ఒపీనియన్ ఎలా తీసుకున్నారనే దానిపై చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. ఇకపై హైడ్రా క్లియరెన్స్ ఉంటేనే హోమ్ లోన్స్ ఇచ్చే విధంగా నిబంధనల రూపకల్పనపై చర్చించనున్నట్లు సమాచారం. ఒకవేళ నిజంగా హైడ్రా లోన్ మాఫీ చేస్తే బాధితులకు అంతకన్నా సంతోషం ఉండదు.

Read Also : Alzheimer’s: అల్జీమర్స్ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా..?