HYDRA Clarification : హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా విభాగం తెలంగాణలో పెను సంచలనంగా మారింది. ఇవాళ కూడా సిటీలో పలుచోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. ఈనేపథ్యంలో కూల్చివేతలకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణను జారీ చేశారు. చెరువుల ఎఫ్‌టీఎల్/బఫర్ జోన్ పరిధిలో ఆక్రమించి నిర్మించిన ఇళ్లను తాము కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. చెరువు శిఖాలను కబ్జా చేసి కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లను, భవనాలను మాత్రమే కూల్చేస్తున్నట్లు ఆయన తేల్చి చెప్పారు.
Also Read :TMC Rajya Sabha MP Resignation : దీదీకి షాక్.. టీఎంసీ ఎంపీ రాజీనామా.. సంచలన లేఖ రిలీజ్
- ఇవాళ హైదరాబాద్‌లోని మాదాపూర్ సున్నం చెరువు, దుండిగల్‌లోని మల్లంపేట చెరువు వద్ద కూల్చేసిన భవనాలన్నీ నిర్మాణ దశలో ఉన్నవేనని రంగనాథ్ పేర్కొన్నారు. అవన్నీ పర్మిషన్లు లేకుండా చెరువుల బఫర్ జోన్‌లో నిర్మిస్తున్నట్లు గుర్తించబట్టే కూల్చేశామని రంగనాథ్(HYDRA Clarification) వివరించారు.
- అమీన్‌పూర్ ఏరియాలో ఏపీకి చెందిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కబ్జా చేసిన స్థలంలో నిర్మించిన షెడ్లను, కాంపౌండ్ వాల్‌ను కూల్చేశామని ఆయన వెల్లడించారు.
- సున్నం చెరువు వద్ద కబ్జా చేసిన స్థలంలో నిర్మించిన షెడ్లు, హోటల్‌ను కూల్చామన్నారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండబట్టే వాటిని తొలగించాల్సి వచ్చిందని రంగనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు నివసిస్తున్న ఏ భవనాలను, ఇళ్లను తాము కూల్చలేదన్నారు.
- మల్లంపేట చెరువు, దుండిగల్ వద్ద ఉన్న నిర్మాణ దశలో ఉన్న 7 విల్లాలను కూల్చినట్లు హైడ్రా కమిషనర్ తెలిపారు. ఆ విల్లాలలో కుటుంబాలేవీ నివాసం ఉండటం లేదన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువు ఎఫ్‌టీఎల్ స్థలంలో ఆ విల్లాలను నిర్మించారని తెలిపారు. సదరు విల్లాలను విజయ్ లక్ష్మి అనే బిల్డర్ నిర్మించినట్లు గుర్తించామన్నారు. ఆమెకు వ్యతిరేకంగా ఇప్పటికే చాలా క్రిమినల్ కేసులు ఉన్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. విజయ్ లక్ష్మికి రాజకీయ వర్గాల్లో మంచి పలుకుబడి ఉందన్నారు.
- సున్నం చెరువు ఏరియాలోని అక్రమ నిర్మాణాలను గతంలోనూ ఓసారి కూల్చివేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బిల్డర్ విజయ లక్ష్మిలపై ఆయా ఏరియాల పోలీసు స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలిపారు.
- ప్రజలు నివసిస్తున్న ఇళ్లను కూల్చే ప్రసక్తే లేదని హైదరాబాద్ ప్రజలకు హైడ్రా కమిషనర్ ఈసందర్భంగా భరోసా ఇచ్చారు. అయితే చెరువుల స్థలాలను కబ్జా చేసిన నిర్మించిన భవనాలను, ఫ్లాట్లను కొనొద్దని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
- ఇళ్లు, భవనాలు కొనేటప్పుడు ఏవైనా సందేహాలు వస్తే నేరుగా హైడ్రాను సంప్రదించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు.