Hydra Police Station : హైడ్రా పోలీసు స్టేషన్ రెడీ అవుతోంది. దీన్నిహైదరాబాద్ నగరంలోని బుద్ధ భవన్ పక్కనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యాలయ ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇవాళ పరిశీలించారు. హైడ్రా పోలీసు స్టేషన్‌లో కల్పించాల్సిన సౌకర్యాలపై ఈసందర్భంగా ఆయన సమీక్షించారు. పోలీసు స్టేషన్ తరహాలోనే లోపల గదులు, క్యాబిన్ల నిర్మాణాలు ఉండాలని ఆయన సూచించారు. హైడ్రా పోలీసు స్టేషన్‌లో అధికారుల కోసం ప్రత్యేక క్యాబిన్లు ఉంటాయి. ఫిర్యాదుదారుల సౌకర్యార్ధం సైతం కొన్ని వసతులు ఉంటాయి. వాటిపై సంబంధిత అధికారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దిశానిర్దేశం చేశారు. హైడ్రా పోలీసు స్టేషన్ సైన్ బోర్డులు ప్రముఖంగా కనిపించేలా చూడాలని వారికి సూచించారు. ఈ పోలీసు స్టేషనుకు(Hydra Police Station) వచ్చే ఫిర్యాదుదారుల వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నారు.
Also Read :Drones Vs Maoists : డ్రోన్లకు చిక్కకుండా అడవుల్లో మావోయిస్టుల ఎస్కేప్.. ఇలా !!
పరికి చెరువులో అక్రమ నిర్మాణాలు.. రేపు కీలకం
హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని పరికి చెరువు పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చేందుకు హైడ్రా రెడీ అవుతోంది. అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టిన యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారని సమాచారం. పేదవాళ్ల పేరుతో పరికి చెరువు పరిధిలో ఇళ్లను నిర్మించి అమ్ముకుంటున్నట్లు తాము గుర్తించామని ఇటీవలే హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రేపు దీనికి సంబంధించిన సమావేశాన్ని హైడ్రా ఆధ్వర్యంలో నిర్వహిస్తారని తెలుస్తోంది. నోటీసులు ఇచ్చిన తర్వాత చెరువులోని అక్రమ కట్టడాలను కూలుస్తారని చెబుతున్నారు. పరికి చెరువు పరిధిలో 25 ఎకరాల దేవాలయ భూమి కబ్జాకు గురవుతోందని తమ దృష్టికి వచ్చిందని రంగనాథ్ తెలిపారు. స్థానికంగా ఉన్న పలువురు నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పారు. వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను హైడ్రా కమిషనర్ ఇటీవలే ఆదేశించారు. ఈనేపథ్యంలో పరికి చెరువులో అక్రమ కట్టడాల నిర్మాణంపై రేపు (బుధవారం) జరగనున్న హైడ్రా సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.