HYDRA Commissioner Ranganath : హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈరోజు హైదరాబాద్ లోని చెరువుల పరిరక్షణపై లేక్ ప్రొటెక్షన్ కమిటీ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓఆర్ఆర్ పరిధిలో చెరువుల ఆక్రమణలు గుర్తిస్తామని రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా చెరువులకు పూర్వ వైభవం తెచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించారు. అదేవిధంగా ఎఫ్‌టీఎల్ , బఫర్ జోన్ల గుర్తింపునకు చర్యలు చేపట్టనున్నారు. చెరువుల ఆక్రమణలకు అస్కారం లేకుండా ప్రత్యేకంగా ఓ యాప్‌ను తీసుకురావాలని నిర్ణయించారు.
Read Also: IIFA awards 2024: ఉత్తమ నటుడిగా హనుమాన్
ఎక్కడ ఆక్రమణలు జరిగినా.. క్షణాల్లో ‘హైడ్రా’ కు తెలిసేలా వ్యవస్థను రూపొందించనున్నారు. ఆక్రమణల తొలగింపు తరువాత వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించేలా చర్యలు చేపట్టనున్నారు. తొలిదశలో భాగంగా సున్నం చెరువు, అప్పా చెరువు, ఎర్రకుంట, కూకట్‌పల్లి నల్ల చెరువులో పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఓఆర్ఆర్ పరిధిలోని చెరువుల ఆక్రమణపై గుర్తిస్తామని తెలిపారు. శాస్త్రీయ పద్ధతుల ద్వారా చెరువుల పరిశీలనలో ఇతర రాష్ట్రాల్లో అవలంభిస్తున్న విధివిధానాలను అధ్యయనం చేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు.
45 ఏళ్ల డేటా ఆధారంగా చెరువుల ఎఫ్‌టీఎల్, మాగ్జిమమ్ వాటర్ స్ప్రెడ్ ఏరియా గుర్తించనున్నారు. ఇందుకు ఎన్ఆర్ఎస్ఏ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, ఇరిగేషన్ విభాగాల డేటాతో సరిపోల్చి నిర్ణయం తీసుకోనున్నారు. విలేజ్ మ్యాప్స్, భూ వినియోగం సర్వే నంబర్లతో సహా సమచారం ఇచ్చే కాడాస్ట్రల్ మ్యాప్స్ , 45 ఏళ్లలో పూర్తి స్థాయిల చెరువు నీరు విస్తరించిన తీరుపై సమాచారం సేకరించనున్నారు. హిమాయత్ సాగర్‌తో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల గుర్తింపు ప్రారంభించి అదే విధానాన్ని అన్ని చెరువుల విషయంలో పాటించేందుకు చర్యలు చేపట్టనున్నారు. చెరువుల ఆక్రమణలపై 2018లో కాగ్ ఇచ్చిన నివేదిక పరిశీలించి, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చెరువులను గుర్తించేందుకు కసరత్తు ప్రారంభించారు. చెరువుల పరిరక్షణపై ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపైనా సమీక్ష నిర్వహిస్తున్నారు.
కాగా, తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అందుకు సంబంధించి ఇవాళ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల విస్తీర్ణంతో పాటు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని నిర్ణయం తీసుకుంది. మూడు నెలల్లో సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సర్వే పూర్తయిన వెంటనే డేటాను డిజిటలైజ్ చేసి అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని సూచించింది.