Shocking : శాస్త్ర సాంకేతికత కొత్త శిఖరాలు అధిరోహిస్తున్న ఈ కాలంలోనూ మూఢనమ్మకాల పంజా ఇంకా విడవడం లేదు. అంతరిక్షం చేరి ప్రయోగాలు చేస్తున్న మహిళలు ఒక వైపు ఉంటే, మరో వైపు నమ్మకాల పేరుతో ప్రాణాలు త్యాగం చేసే ఘటనలు మన సమాజంలో ఇంకా చోటుచేసుకుంటున్నాయి. అటువంటి షాకింగ్ సంఘటన శనివారం (ఆగస్టు 3) హైదరాబాద్‌లో జరిగింది. హిమాయత్‌నగర్ ఉర్దూ హాల్ ఎదురుగా ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న పూజా జైన్ (43) అనే గృహిణి ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వ్యాపారి అరుణ్‌కుమార్ జైన్‌కు 2002లో పూజా వివాహమైంది. ఈ దంపతులకు ఓ కూతురు, ఓ కొడుకు ఉన్నారు. కుటుంబం సుఖశాంతులతో సాగుతుండగా గత ఐదేళ్లుగా పూజా మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఆధ్యాత్మికతపై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభించింది. ఇటీవల ఆమెకు దైవ చింతన మరింత పెరిగి రోజంతా పూజ, ధ్యానం, మతపరమైన గ్రంథాల పఠనంలో గడపసాగింది.
Yashasvi Jaiswal: కోహ్లీ, రోహిత్ శర్మలపై కీలక వ్యాఖ్యలు చేసిన జైస్వాల్!
శనివారం ఉదయం భర్త ఆఫీస్‌కి వెళ్లగా, పిల్లలు, పని మనిషి ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం వరకూ పూజ గదిలో ఒంటరిగానే కూర్చుంది. కొంతసేపటి తర్వాత ఎవరికీ తెలియకుండానే ఐదో అంతస్తు పై నుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలతో హుటాహుటిన హైదర్‌గూడలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పూజ గదిలో ఒక ఉత్తరాన్ని కనుగొన్నారు. దాంట్లో జైన మతానికి చెందిన ఒక సూక్తిని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
“దైవధ్యానంలో గడుపుతూ ఆత్మార్పణ చేసుకుంటే దేవుడి దగ్గరకు చేరుకుని స్వర్గప్రాప్తి కలుగుతుంది” అన్నది ఆ సూక్తి సారాంశమని ఎస్సై నాగరాజు మీడియాకు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన మానసిక ఆరోగ్య సమస్యలు, మూఢనమ్మకాలు, మరియు మతపరమైన అర్థతప్పుదలలు ఎలా ప్రాణాంతక పరిణామాలకు దారి తీస్తాయో మరోసారి బహిర్గతం చేసింది.