Site icon HashtagU Telugu

Wine Shops : హైదరాబాద్‌లో మద్యం షాపుల టెండర్ల‌కు భారీ స్పందన

Bars

Bars

తెలంగాణలో ఎన్నికల సీజన్ రానున్న నేపథ్యంలో మద్యం దుకాణాల టెండర్లకు భారీ స్పందన వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దుకాణాలు దక్కితే డబ్బుల వర్షం కురుస్తుందనే ఉద్దేశ్యంతో చాలా మంది దరఖాస్తులు చేసుకుంటున్నారని తెలిపారు. మూడు రోజుల్లోనే 2 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు వివరించారు. ఈసారి మద్యం టెండర్ల కోసం భారీ పోటీ నెలకొందని చెబుతున్నారు. దరఖాస్తు రుసుం (నాన్ రిఫండబుల్)గా రెండు ల‌క్ష‌లు వసూలు చేసినా ద‌ర‌ఖాస్తుదారులు వెన‌క్కి త‌గ్గ‌డం లేద‌ని అధికారులు తెలిపారు. గత నోటిఫికేషన్‌లో ప్రభుత్వం దరఖాస్తు ఫీజు రూపంలో రూ.1,350 కోట్లు వసూలు చేయగా, ఈసారి అంతకంటే ఎక్కువ మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో మద్యం షాపుల టెండర్ల కోసం చాలా మంది పోటీ పడుతున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పటికే 2 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, రానున్న రోజుల్లో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆగస్టు 18 సాయంత్రం 6 గంటలతో టెండర్ల సమర్పణకు గడువు ముగుస్తుందని, లాటరీ విధానంలో 21న మద్యం దుకాణాలను కేటాయిస్తారని అధికారులు వివరించారు.

Exit mobile version