తీవ్ర వర్షాలు, వరదలతో హైదరాబాద్ (Hyderabad) నగరం జల దిగ్బంధంలో చిక్కుకున్న నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వాతావరణ శాఖ ముందుగానే భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోవడం దుర్మార్గమని, ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని హరీశ్‌రావు మండిపడ్డారు. వరద అంచనా వేయడంలో, ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో, విభాగాల మధ్య సమన్వయం సాధించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు.
IPS Transfer : తెలంగాణ లో 23 మంది ఐపీఎస్‌లు బదిలీ
హరీశ్‌రావు (Harishrao) మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే ఎంజీబీఎస్ బస్టాండ్‌లో ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, పండుగ సీజన్‌లో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు భయంతో రాత్రంతా పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. మూసీ నది ప్రమాదకరంగా ఉప్పొంగుతున్న కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని హరీశ్‌రావు అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) రాజకీయాలు పక్కన పెట్టి వరదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, పరిసర ప్రాంత ప్రజలను తరలించి వారికి పూర్తి సహాయం అందించాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఈ వర్షాలు, వరదల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని, అధికార యంత్రాంగం సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.