Traffic Challan : ఆ రూ.90 లే ఈరోజు రూ.250 కోట్లు వచ్చేలా చేసింది

తెలంగాణ ట్రాపిక్ పోలీస్ రూటే వేరు. ఏ ముహూర్తాన చలానా క్లియరెన్స్ ఐడియా వేశారో కాని.. అది కాస్తా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

  • Written By:
  • Publish Date - March 31, 2022 / 11:48 AM IST

తెలంగాణ ట్రాపిక్ పోలీస్ రూటే వేరు. ఏ ముహూర్తాన చలానా క్లియరెన్స్ ఐడియా వేశారో కాని.. అది కాస్తా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అది కూడా ఎంతలా అంటే.. రూ.90తో మొదలై.. రూ.250 కోట్ల వరకు వెళ్లింది. దీని వెనుక మాత్రం చాలా పెద్ద కథుంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికి ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్ మెంట్ జరిమానాలు విధిస్తుంది. కానీ చాలామంది వాటిని చెల్లించక బకాయి పడుతుంటారు. అలాంటివారికి ఓ బంగారం లాంటి అవకాశాన్ని కల్పించింది.

ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్ మెంట్ ఇచ్చిన మహదావకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాహనదారులు.. ఒక్కసారిగా పెండింగ్ చలాన్లను చెల్లించడం మొదలుపెట్టారు. ఇలా మార్చి 1న మొదలుపెట్టిన ఈ-లోక్ అదాలత్ కార్యక్రమంలో తొలి చలానాను ఆ రోజు తెల్లవారుజామున ఓ వాహనదారుడు అర్థరాత్రి 1.24 గంటలకు చెల్లించాడు. తన ద్విచక్రవాహనంపై ఉన్న జరిమానాలో రిబేట్ పోగా రూ.90 అయ్యింది. దానిని వెంటనే చెల్లించాడు. ఈ-లోక్ అదాలత్ లో మొదటి చెల్లింపు ఇదే. దీంతో బోణీ అదిరింది బాస్ అనుకున్నారు. ఎందుకంటే ఆ రూ.90 లే ఇప్పుడు రూ.250 కోట్లకు చేరేలా చేసింది.

ఈ-లోక్ అదాలత్ గడువు మార్చి 31 వరకే ఉంది. కానీ దానికి విశేష స్పందన రావడంతో ప్రభుత్వం ఈ గడువును ఏప్రిల్ 15 వరకు పెంచింది. దీనివల్ల ఈ-చలాన్ల బకాయిల మొత్తం రూ.1700 కోట్లు కూడా త్వరలోనే వసూలు అయ్యే అవకాశముంది. బుధవారం (30-03-2022) వరకు చూస్తే.. 2.57 కోట్ల చలాన్లకు గాను రూ.250 కోట్లు వసూలయ్యింది.

చలాన్ల ప్రారంభకాలంలో రోజువారీ చెల్లింపులు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉండేవి. తరువాతి కాలంలో రోజువారీ చెల్లింపులు అది రూ.10-15 లక్షలకు చేరాయి. అందుకే ప్రభుత్వం కూడా గడువును పొడిగించింది. మార్చి నెలలో ఆన్ లైన్ పేమెంట్స్ ద్వారా రూ.60 కోట్లు వచ్చాయి. అందులోనూ ఎక్కువగా పేటీఎం ద్వారానే వచ్చాయి.