Site icon HashtagU Telugu

Child Abuse: పిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో అగ్రస్థానంలో హైదరాబాద్

Child Abuse

Child Abuse

లైంగిక నేరాల నుంచి పిల్లలు రక్షణ పొందే చట్టం(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్-పోస్కో), పిల్లలను లక్ష్యంగా చేసుకుని చేసే సైబర్ నేరాల కింద నమోదయ్యే కేసుల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతున్నాయి. 2016లో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన తరువాత పోస్కో చట్టం కింద హైదరాబాద్ లో అత్యధిక కేసులు నమోదైనట్లు మహిళా రక్షణ విభాగం అడిషనల్ డీజిపీ స్వాతి లక్రా చెప్పారు.

అయితే, శిక్షల సంఖ్య కూడా పెరిగినట్లు తెలిపారు. 2016 నుంచి పోస్కో చట్టం కింద కేసులు 1,879 నమోదై హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. 2018 నుంచి 327 కేసులతో వికారాబాద్ రెండవ స్థానంలో ఉంది. మహిళా పోలీస్ అధికారులు చెప్పిన ప్రకారం పిల్లలు లైంగిక, శారీరక వేధింపులు, సైబర్ నేరాలు, బెదిరింపులు, వెంటబడటం వంటి వాటిగురించి మాట్లాడటానికి భయపడతారు. ఇటువంటి విషయాలు తల్లిదండ్రులకు చెప్పడానికి కూడా వారు భయపడతారని స్వాతి లక్రా చెప్పారు. వారికి చెబితే వారు కంగారు పడతారని భావిస్తారు. అంతేకాక, తమని ప్రశ్నించడం, నిందించడం వంటివి మొదలు పెడతారని కూడా వారిలో భయం ఉంటుందని ఆమె తెలిపారు.

సామాజికంగా ఎలా మెలగాలో ఆడపిల్లలకు తల్లిదండ్రులు తెలియజేయాలన్నారు. భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇటువంటి సంఘటనలపై ఫిర్యాదు చేయడానికి తల్లిదండ్రులు ముందుకు వస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి నేరాలకు సంబంధించి 2016లో శిక్షల రేటు పది శాతం ఉండగా, 2022 నాటికి 35 శాతానికి పెరిగినట్లు తెలిపారు. కాగా, ఆన్ లైన్ లో జరిగే ఆర్థిక దోపిడీలు, లైంగిక వేధింపులపై పిల్లలకు పెద్దగా అవగాహన ఉండదు. 2020లో పోలీస్ శాఖ నిర్వహించిన ఒక సర్వేలో సైబర్ భద్రతపై అవగాహన వారికి తక్కువని తేలింది.