హైదరాబాద్ చెరువులు మరింత కట్టుదిట్టంగా!

చిన్నపాటి వర్షానికే వీధులన్నీ చెరువులుగా దర్శనమిస్తున్నాయి. ఆహ్లదం పంచాల్సిన చెరువుల్లో మురుగు నీటితో నిండుకుంటున్నాయి. చెరువుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చెరువుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోబోతోంది.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:33 PM IST

చిన్నపాటి వర్షానికే వీధులన్నీ చెరువులుగా దర్శనమిస్తున్నాయి. ఆహ్లదం పంచాల్సిన చెరువుల్లో మురుగు నీటితో నిండుకుంటున్నాయి. చెరువుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చెరువుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోబోతోంది.

హైదరాబాద్ మహానగరంలోని చెరువులను మరింతగా అభివృద్ధి పరిచేందుకు, వాటిని పరిరక్షించడానికి ప్రత్యేకంగా ఒక స్పెషల్ కమిషనర్ ని నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగర పరిధిలో 185 చెరువులు మరియు ఇతర జల వనరులున్నాయి. వీటిని అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాల్సిన బాధ్యత ఈ స్పెషల్ కమిషనర్ కి ఉంటుంది. అయితే గత కొంత కాలంగా హైదరాబాద్ నగరంలోని చెరువుల సుందరీకరణ, అభివృద్ధి, వాటి పరిరక్షణకు సంబంధించి కార్యక్రమాలను ప్రభుత్వమే చేపట్టేది. ప్రత్యేకంగా కమిషనర్ ను నియమించడం ద్వారా హైదరాబాద్ లోని చెరువుల డెవలప్ మెంట్ వేగవంతంగా కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. హైదరాబాద్ పరిధిలోని చెరువుల రక్షణకు మూడు రకాల ప్రణాళికలను సిద్ధం చేసిన మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, ప్రకాశ్ గౌడ్ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. సమగ్ర చెరువుల రక్షణలో భాగంగా పలు విషయాలను ఆయన వెల్లడించారు.

చెరువుల సుందరీకరణలో భాగంగా వాకింగ్ ట్రాక్, చెరువుల చుట్టూ ఫెన్సింగ్, మురుగు నీటి మల్లింపు విషయాలను వివరించారు. హైదరాబాద్ లో మొత్తం 185 చెరువులు ఉండగా, ఇప్పటికే 125 చెరువుల పనులు ప్రారంభమయ్యాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కొందరు అక్రమ నిర్మాణాలు, భూకబ్జాలకు పాల్పడటంతో చెరువులు పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రత్యేక కమిటీ వేసి నిర్మాణాలను తొలగిస్తామని కేటీఆర్ అన్నారు. గతేడాది అక్టోబర్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా సరస్సులు పొంగిపొర్లుతుండడంతో జనజీవనం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. వర్షాల సమయంలో చెరువుల గట్లు విరిగిపడడంతో లోతట్టు ప్రాంతాల నుండి అనేక మందిని తరలించాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ అన్నారు.