Hyderabad Pubs: రాత్రి 10 దాటితే సౌండ్ వినిపించొద్దు.. పబ్స్‌కు హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్ పబ్స్ నిర్వాహణపై హైకోర్టు కీలక ఉత్తర్వులు వెల్లడించింది.

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 10:30 PM IST

హైదరాబాద్ పబ్స్ నిర్వాహణపై హైకోర్టు కీలక ఉత్తర్వులు వెల్లడించింది. పబ్ పరిసరవాసులకు ఊరట లభించింది. రాత్రి పది దాటితే సౌండ్ వాడటానికి వీల్లేదంటూ మధ్యంతర తీర్పు వెల్లడించింది. కొంతకాలంగా హైదరాబాద్‌లో నెలకొన్న పబ్స్‌పై పలువురు పిటీషన్లు దాఖలు చేశారు. రాత్రి నుంచి తెల్లవారుఝాము వరకూ ఇష్టానుసారం సౌండ్స్‌తో ఇబ్బందులకు గురి చేస్తున్నారని కోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు . హైదరాబాద్ పబ్స్ నిర్వాహణపై మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించింది. రాత్రి 10 దాటితే పబ్స్‌లో ఎటువంటి సౌండ్ పెట్టరాదంటూ హైకోర్టు ఆదేశించింది. రాత్రి 10 నుండి తెల్లవారుజాము 6 వరకు ఎటువంటి సౌండ్స్, మైక్స్, లౌడ్ స్పీకర్ లాంటి వాటికి అనుమతి రద్దుచేసింది.

డే టైంలో సైతం సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఇవ్వాలని సూచించింది హైకోర్టు. ఎక్సైజ్ రూల్స్ ప్రకారం నివాస ప్రాంతాలు, విద్యా సంస్థలు ఉన్న ప్రదేశాల్లో పబ్‌లకు ఎలా అనుమతి ఇచ్చారని హై కోర్టు ఎక్సైజ్ శాఖను ప్రశ్నించింది. ఇటీవల టాట్ పబ్ విషయంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఆదేశాలు జారీ చేసింది. ఏ నిబంధనల ప్రకారం ట్రేడ్ లైసెన్స్‌లు ఇచ్చారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని జిహెచ్ఎంసి అధికారులను హైకోర్టు ఆదేశించింది.

పబ్‌లపై తదుపరి విచారణ ఈనెల 26కు వాయిదా వేసింది హైకోర్టు. హైకోర్టు తీర్పుపై పబ్స్ బాధిత స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పబ్స్‌కు అనుమతులపై సంబంధిత శాఖలకు నోటీసులు జారీచేసింది. మూడు పోలీస్ కమిషనరేట్లను వివరణ కోరింది. రెండు వారాల్లో కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించింది. తదుపరివిచారణ 26కు వాయిదా వేసింది.