Ganja Chocolates : చాక్లెట్ల అవతారమెత్తిన గంజాయి.. ఇంజినీరింగ్ విద్యార్థులే టార్గెట్

Ganja Chocolates : హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్ల సేల్స్ కలకలం రేపుతున్నాయి.

  • Written By:
  • Publish Date - January 30, 2024 / 11:46 AM IST

Ganja Chocolates : హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్ల సేల్స్ కలకలం రేపుతున్నాయి. ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి అమ్ముతున్నారు.  ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేసి వారికి గంజాయి చాక్లెట్స్‌ను విక్రయిస్తున్నారు. ఇటీవల శంషాబాద్‌లో స్కూలు సమీపంలో ఉన్న ఓ దుకాణంలో విక్రయించిన చాక్లెట్లు తిని విద్యార్థులు వింత వింతగా ప్రవర్తించారు. ఈ ఘటనను మరిచిపోకముందే మరోసారి హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్లు భారీగా పట్టుబడ్డాయి. ఏకంగా 4 కిలోల గంజాయి చాక్లెట్లను పోలీసులు సీజ్ చేశారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో భారీ గంజాయి చాక్లెట్స్(Ganja Chocolates) ముఠా గుట్టు రట్టయింది. గంజాయి చాక్లెట్లు ఉన్నాయన్న సమాచారం అందడంతో రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రైడ్స్ చేశారు. 4 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కోకాపేట్ రాంకీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ వద్ద సోదాలు చేసిన ఎక్సైజ్ అధికారులు.. ఓ గదిలో నిల్వ ఉంచిన గంజాయి చాక్లెట్స్‌ను గుర్తించారు. ఆ స్టాక్ మొత్తాన్ని సీజ్ చేశారు. ఒడిశాకు చెందిన సౌమ్యా రాజన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్స్ తీసుకువచ్చి సౌమ్యా రాజన్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో పాటు రోజు వారీ కూలీలకు కూడా ఈ గంజాయ్ చాక్లెట్స్‌ను సౌమ్యా రాజన్ విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది.

Also Read : Pak Sailors Rescued : 19 మంది పాక్ మత్స్యకారులను రక్షించిన ఇండియన్ నేవీ

ఖమ్మంలోనూ.. 

ఎక్సైజ్ ప్రొహిబిషన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి , ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఖమ్మం టూ టౌన్ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ఆధ్వర్యంలో సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు అనుమానితులను సీఐ ఆర్.విజయేందర్ తన సిబ్బందితో తనిఖీ చేయగా.. వారి వద్ద ఎనిమిది కేజీల ఎండు గంజాయి, మూడు కేజీల గంజాయి చాక్లెట్లు లభించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారు ఔరంగాబాద్, మహారాష్ట్ర ప్రాంతాల్లో వాటిని తయారు చేసి వివిధ రాష్ట్రాల్లో అమ్మకాలు జరుపుతున్నట్లు తమ విచారణలో వెళ్లడైనట్లుగా ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు.

500 కిలోల గంజాయి లభ్యం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లాలో మరో గంజాయి ముఠా గుట్టు రట్టయ్యింది. సమీప రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో అల్లూరి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ప్రధాన రహదారులపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం పోలీస్‌స్టేషన్‌ చెక్‌పోస్టు దగ్గర అనుమానం వచ్చి ఓ కారును తనిఖీ చేయగా.. అందులో 500 కిలోల గంజాయి లభ్యమైంది. అనంతరం కారులో ఉన్న వ్యక్తిని పోలీసులు విచారించగా.. ఆ డంప్‌ను ఒడిశా నుంచి రాజస్థాన్‌కు తరలిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కారును సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు.