Hyderabad : దుబాయ్ నుంచి బంగారం స్మ‌గ్లింగ్‌.. ముగ్గుర్ని అరెస్ట్ చేసిన హైద‌రాబాద్ పోలీసులు

బంగారం స్మగ్లింగ్‌ రాకెట్‌ను హైద‌రాబాద్ పోలీసులు ఛేదించారు. ముగ్గురు వ్యక్తుల నుంచి మొత్తం 700 గ్రాముల 6 బంగారు

  • Written By:
  • Publish Date - March 2, 2023 / 07:20 AM IST

బంగారం స్మగ్లింగ్‌ రాకెట్‌ను హైద‌రాబాద్ పోలీసులు ఛేదించారు. ముగ్గురు వ్యక్తుల నుంచి మొత్తం 700 గ్రాముల 6 బంగారు బిస్కెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ట్రావెల్ ఏజెంట్, మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారు బిస్కెట్లు తరలిస్తున్న సయ్యద్‌ మోయిజ్‌ పాషా, సమీర్‌ఖాన్‌, మహ్మద్‌ అర్షద్‌లను సైబరాబాద్‌ పోలీసు రాజేంద్రనగర్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) అధికారులు కస్టమ్స్‌ అధికారులతో కలిసి పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫలక్‌నుమాలోని ఖాద్రీ చమన్‌కు చెందిన సయ్యద్ మోయిజ్ పాషా అనే ట్రావెల్ ఏజెంట్, కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసేందుకు అక్రమంగా బంగారాన్ని దిగుమతి చేసుకునేందుకు దుబాయ్‌కి టూరిస్ట్ వీసాలతో స్థానికులను ఎర వేస్తున్నాడు. అక్రమంగా దిగుమతి చేసుకున్న బంగారు బిస్కెట్లను వట్టెపల్లి, మైలార్‌దేవ్‌పల్లిలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ఎస్‌ఓటీ అధికారులు మోయిజ్‌పాషాను పట్టుకున్నారు.

ఎంక్వైరీ చేయగా.. ఫిబ్రవరి రెండో వారంలో సమీర్‌ఖాన్‌ను టూరిస్ట్ వీసాపై దుబాయ్‌కు పంపినట్లు పోలీసులకు వెల్లడించాడు. దాదాపు 700 గ్రాముల బరువున్న 6 బంగారు బిస్కెట్లతో సమీర్ ఇండియాకు తిరిగొచ్చాడు. గతంలో 4 నుంచి 5 సార్లు బంగారాన్ని స్మగ్లింగ్ చేసి మసూద్ జ్యువెలరీకి చెందిన మహ్మద్ అర్షద్, ఎస్/ఓ మహ్మద్ మసూద్‌లకు విక్రయించినట్లు వెల్లడించాడు. సైబరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి 6 బంగారు బిస్కెట్లు, 13 పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం బంగారాన్ని హైదరాబాద్‌లోని జీఎస్టీ భవన్‌లోని కస్టమ్స్‌ అదనపు కమిషనర్‌కు అధికారులు అప్పగించారు.