Hyderabad Padukas : జనవరి 22న ప్రారంభం కానున్న అయోధ్య రామమందిరానికి మన హైదరాబాద్ నుంచి కూడా కానుకలు వెల్లువెత్తుతున్నాయి. అయోధ్య రామాలయంలో వినియోగించనున్న 118 దర్వాజాలు సైతం మన హైదరాబాద్‌లోనే తయారవుతున్న సంగతి తెలిసిందే. ఇక అయోధ్య రామమందిరంలో ఉంచే పాదుకలను హైదరాబాద్ కంటోన్మెంట్ బోయిన్‌పల్లిలోని శ్రీమద్విరాట్ కళా కుటీర్ లోహశిల్పి పిట్లంపల్లి రామలింగచారి రూపొందించారు. ఈ పాదుకలను 15 కిలోల పంచలోహాలతో తయారు చేసి వెండి, బంగారంతో తాపడం చేశారు. ఈ పాదుకల తయారీకి అయోధ్య భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చర్ల శ్రీనివాసశాస్త్రి నిధులు ఇచ్చారు. ఈ పాదుకల తయారీకి దాదాపు రూ.1.03 కోట్లు ఖర్చయింది. సరిగ్గా 9 కిలోల బరువున్న ఈ పాదుకల తయారీ కోసం 8 కిలోల వెండిని వినియోగించారు. మరో కిలో బంగారంతో ఆ పాదుకలకు తాపడం చేశారు. జనవరి 22న అయోధ్య రామమందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ఆ పాదుకలను ఆలయంలో ప్రతిష్టించనున్నారు.ఇప్పటికే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన సమయంలో శ్రీనివాసశాస్త్రి 5 వెండి ఇటుకలను కూడా అందజేశారు.
- ఒక జత పాదుకలను(Hyderabad Padukas) ఈరోజు (సోమవారం) ఉదయం విమానంలో అయోధ్యకు తీసుకొని బయలుదేరారు.
- మరొక జత పాదుకలను రామభక్తులు ఇప్పటికే పాదయాత్రగా తీసుకెళ్తున్నారు.
- అక్టోబర్ 28న కాకినాడలోని వెదరుపాకం నుంచి ఆ పాదుకలతో పాదయాత్రగా బయలుదేరారు. రామేశ్వరం, శృంగేరి, కంచి, తిరుమల, శ్రీరంగ, సింహాచలం, విజయవాడ సహా అనేక పుణ్యక్షేత్రాలు, మఠాల్లో ఆ పాదుకలు పూజలు అందుకోనున్నాయి.
- ఈ నెల 10 నుంచి 15వ తేదీ మధ్యలో ఈ రెండు జతల పాదుకలను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్‌కు అందివ్వనున్నారు.