Site icon HashtagU Telugu

Hyderabad ORR Lease : కారుచౌకగా హైదరాబాద్ ఓఆర్ఆర్ లీజు.. ఐఆర్‌బీకి 16 నెలల్లోనే రూ.1000 కోట్లు

Hyderabad Orr Lease Outer Ring Road Irb Infrastructure Brs Ktr

Hyderabad ORR Lease : బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్ఆర్)ను కారుచౌకగా ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి లీజుకు ఇచ్చిన వ్యవహారంతో ముడిపడిన కీలక విషయాలు వెలుగుచూశాయి. 2023 సంవత్సరం ఆగస్టు 11న రూ.7,380 కోట్లకే ఓఆర్ఆర్‌ను 30 ఏళ్ల లీజు కోసం ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు కట్టబెట్టారు. అయితే మొదటి  16 నెలల్లోనే ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా దాదాపు రూ.1000 కోట్లు సంపాదించింది. ఒక్క 2024 సంవత్సరంలోనే దాదాపు రూ.764 కోట్లను ఆర్జించింది. అంటే మొత్తం 30 ఏళ్ల లీజు వ్యవధిలో ఆ కంపెనీ ఎన్ని వేల కోట్లను సంపాదించగలదో మనం అంచనా వేసుకోవచ్చు. ఈ లెక్కలను వేయకుండానే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఆర్ఆర్‌ను లీజుకు ఇచ్చేసిందా ? ఏదిఏమైనప్పటికీ ఆనాడు తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ సర్కారు ఖజానాకు చేరాల్సిన సొమ్ము ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా ఖాతాలో చేరే పరిస్థితి  ఏర్పడిందనే విమర్శలు వస్తున్నాయి.

Also Read :Big Pushpas : బిగ్ ‘పుష్ప’లు.. రహస్య స్థావరాల్లో భారీగా ఎర్రచందనం దుంగలు!

2023 ఆగస్టు 11 నుంచి.. 

హైదరాబాద్‌ మహానగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర జవహర్‌లాల్‌ నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్డును నిర్మించారు. ఇదే  హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్ఆర్). దీన్ని వేలంపాటలో ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా అనుబంధ సంస్థ ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రైవేటు లిమిటెడ్‌(Hyderabad ORR Lease) దక్కించుకుంది. అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.7380 కోట్లను చెల్లించి ఓఆర్ఆర్  లీజును ఐఆర్‌బీ కైవసం చేసుకుంది. లీజు సొమ్మును చెల్లించడానికి ఐఆర్‌బీ కంపెనీ లోన్లు తీసుకుంది. ఈ లీజు ఒప్పందం 2023 ఆగస్టు 11 నుంచి అమల్లోకి వచ్చింది. ముప్పై ఏళ్ల పాటు హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌కు సంబంధించిన నిర్వహణ, టోల్‌ వసూలు బాధ్యతలను ఐఆర్‌బీ నిర్వర్తించనుంది.

Also Read :Vijayasai Reddy : వైసీపీలో విజయసాయిరెడ్డి ప్లేస్‌ ఆ యువనేతకేనా ? జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

పదేళ్లలో లోన్లు క్లియర్ ?

ఐఆర్‌బీ కంపెనీ తీసుకున్న రుణాలు రాబోయే పదేళ్లలోనే తీరిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అంత భారీ రేంజులో ఈ కంపెనీకి హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి టోల్‌ వసూళ్ల ఆదాయం వస్తోంది. ఈ లెక్కన పదేళ్ల తర్వాత.. దాదాపు 20 సంవత్సరాల పాటు ఐఆర్‌బీ కంపెనీకి వచ్చేదంతా లాభమే. ఏడాదికి సగటున రూ.700 కోట్ల టోల్ వసూలు ఆదాయం ఐఆర్‌బీ కంపెనీకి వచ్చినా..  20 ఏళ్లలో దాదాపు రూ.15వేల కోట్ల దాకా దాని ఖాతాలోకి చేరుతాయి. బీఆర్ఎస్ హయాంలో కారుచౌకగా లీజు దక్కినందు వల్లే ఈ అవకాశం ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.