Site icon HashtagU Telugu

Telangana Sports Hub Board : క్రీడా ప్రపంచానికి హైద‌రాబాద్ వేదిక కావాలి – సీఎం రేవంత్

Telangana Sports Hub Board

Telangana Sports Hub Board

తెలంగాణలో క్రీడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైద‌రాబాద్‌లో జరిగిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు తొలి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడా ప్రపంచానికి హైద‌రాబాద్ వేదిక కావాలని ఆకాంక్షించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీలు నిర్వహించినా వాటిలో తెలంగాణకు చోటు కల్పించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. క్రీడా రంగానికి గ‌తంతో పోలిస్తే 16 రెట్లు బడ్జెట్ పెంచామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు ప్రోత్సాహకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.

గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేస్తామని చెప్పారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించారు. క్రీడా సామగ్రిపై పన్నులను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. రానున్న మూడేళ్లలో తెలంగాణను క్రీడా రంగంలో అగ్రగామిగా నిలపడం బోర్డు లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు బోర్డు పలు తీర్మానాలు చేసింది. స్టేడియాల నిర్వహణ, కోచ్‌లకు శిక్షణ, క్రీడా పాలసీ రూపకల్పన, సబ్ కమిటీలు ఏర్పాటుపై నిర్ణయాలు తీసుకున్నారు.

Pocharam Barrage : రికార్డు వరదను తట్టుకున్న 100 ఏళ్ల పోచారం బ్యారేజ్ ..అసలు సీక్రెట్ ఇదే !!

ఈ సమావేశంలో కపిల్ దేవ్, అభినవ్ బింద్రా, పుల్లెల గోపీచంద్ వంటి ప్రముఖ క్రీడాకారులు విలువైన సూచనలు చేశారు. కపిల్ దేవ్ మాట్లాడుతూ.. మొదట క్రీడా సంస్కృతిని పెంపొందించడమే ముఖ్యం అని, ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో పాల్గొనేలా చూడాలని సూచించారు. అభినవ్ బింద్రా పాఠశాల స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. గోపీచంద్ గ్రామ స్థాయి నుంచే క్రీడా పోటీలు దశలవారీగా నిర్వహిస్తే మెరుగైన క్రీడాకారులను ఎంపిక చేయవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే బైచుంగ్ భూటియా ప్రతి ఆటకు ప్రత్యేక లీగ్‌లు ఉండాలని సూచించారు.