Site icon HashtagU Telugu

9 People Died : హైదరాబాద్‌లో తొమ్మిది మంది సజీవ దహనం.. ఏమైందంటే ?

7 People Died

7 People Died

9 People Died : హైదరాబాద్‌లోని నాంపల్లి బజార్ ఘాట్‌లో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఉన్న కెమికల్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించి తొమ్మిది మంది  సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఐదేళ్ల చిన్నారి ఉన్నట్లు తెలిసింది. రెండు మృతదేహాలు గుర్తించడానికి కూడా వీలులేనంతగా కాలిపోయాయి. మృతుల్లో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిసింది. మహ్మద్ ఆజామ్ అనే వ్యాపారికి చెందిన కుటుంబమంతా చనిపోయారని తెలిసింది. వీరు ఈ  భవనంలోని 2వ ఫ్లోర్‌లో నివసిస్తున్నారని తెలిసింది. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.మరో 8మందికి ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ అందుతోంది. మంటల్లో చిక్కుకున్న 15 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. గోదాంలోని ఐదో అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి.

We’re now on WhatsApp. Click to Join.

గోదాం పైఅంతస్తుల్లో మరికొంతమంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. వారిని రక్షించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైర్ సిబ్బంది 3 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో గోదాం వద్ద ఉన్న కారు, ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటం చూసి భయాందోళనకు గురయ్యామని సమీపంలోని అపార్ట్‌మెంట్ వాసులు తెలిపారు. కెమికల్  గోదాంపైన రెసిడెన్షియల్ భవనం  ఉందని (9 People Died) తెలుస్తోంది.

ప్రమాదానికి కారణం ? 

ఈ అగ్ని ప్రమాదం జరిగిన అపార్ట్‌మెంట్ యజమాని రమేష్ జైశ్వాల్‌‌కు కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నట్లు తెలిసింది. అపార్ట్‌మెంట్ సెల్లార్ లోని గోడౌన్‌లో దాదాపు 130 కెమికల్ డ్రమ్ములను అతడు స్టోర్ చేశాడు. అక్కడే అగ్ని ప్రమాదం జరగడంతో 30 కెమికల్ డ్రమ్ముల దాకా కాలిపోయాయి. మరో 100 డ్రమ్ములను రెస్క్యూ ఆపరేషన్‌లో బయటికి తీశారు. ప్రస్తుతం రమేష్ జైశ్వాల్ పరారీలో ఉన్నాడు. పోలీసులు గాలిస్తున్నారు. సెల్లార్‌లో ఉన్న కెమికల్ గోడౌన్లో  ఓ కారును రిపేర్ చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసిపడి మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. అవి క్షణాల్లో భవనంపైకి వ్యాపించడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది. నల్లటి పొగవల్ల చాలామందికి ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు భరించలేని కెమికల్ వాసనలు కూడా స్థానికులకు తీవ్ర ఇబ్బంది కలిగించాయి. ప్రమాదం జరిగిన భవనంలో 70 మంది దాకా నివసిస్తున్నట్లు తెలిసింది.