Hyderabad MLC Election: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ముగిసింది. 78.57 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 112 మంది ఓటర్లు ఉండగా, 88 మంది ఓట్లు వేశారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంలకు చెందిన 66 మంది కార్పొరేటర్లు ఓట్లు వేశారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంలకు చెందిన 22 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. మొత్తం మీద బీఆర్‌ఎస్ మినహా అన్ని పార్టీలకు చెందిన ఎక్స్ అఫీషియో సభ్యులు, కార్పొరేటర్లు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు.
Also Read :Megha Engineering: న్యూక్లియర్ పవర్ రంగంలోకి ‘మేఘా’.. రూ.12,800 కోట్ల కాంట్రాక్ట్
రెండు పోలింగ్ కేంద్రాలు
జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) ప్రధాన కార్యాలయంలో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు వేసేందుకు జీహెచ్ఎంసీ భవన నిర్వహణ విభాగం గదిలో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, 81 మంది కార్పొరేటర్ల కోసం లైబ్రరీ హాల్‌లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 25న ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Also Read :India Vs Pak : భారత ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్.. కీలక ప్రకటన ?
అనూహ్యంగా బీజేపీ పోటీ చేయడంతో..
హైదరాబాద్ ఎమ్మెల్సీ(Hyderabad MLC Election) స్థానం ఈ సారి కూడా ఏకగ్రీవం అవుతుందని తొలుత భావించారు. అయితే అనూహ్యంగా బీజేపీ పోటీ చేయడంతో ఈ ఎన్నిక జరిగింది. గత 22 ఏళ్లుగా హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అవుతూ వస్తోంది. 22ఏళ్ల తర్వాత తొలిసారిగా హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్దిగా మీర్జా రియాజుల్ హసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలోకి దిగారు. ఈ ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరంగా ఉండిపోయాయి. ఓటింగ్‌లో సైతం పాల్గొనబోమని బీఆర్ఎస్ ప్రకటించింది. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పదవీకాలం మే 1న ముగియనుంది. దీంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహిస్తున్నారు.