హైదరాబాద్: (Hyderabad Metro) హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ తొలిదశను పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో, ఎల్‌అండ్‌టీ (L&T) సంస్థతో చర్చలు సఫలమయ్యాయి. ఇందులో భాగంగా మెట్రో ప్రాజెక్ట్‌పై ఉన్న భారీ అప్పును ప్రభుత్వం భుజాన వేసుకోనుంది.
తెలంగాణ ప్రభుత్వం, మెట్రో ప్రాజెక్ట్ తొలి దశను సంపూర్ణంగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రైవేట్ సంస్థ అయిన ఎల్‌అండ్‌టీకి ఉన్న సుమారు రూ.13,000 కోట్ల అప్పును ప్రభుత్వం టేక్‌ఓవర్ చేయనుంది. ఇక, మెట్రో నిర్వహణ బాధ్యతల నుంచి ఎల్‌అండ్‌టీ వైదొలగనుంది.
ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ప్రస్తుతానికి ఎల్‌అండ్‌టీకి రూ.2,100 కోట్లు నగదు రూపంలో చెల్లించేందుకు అంగీకరించింది. ఈ అంగీకారంతో, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు పై ఎల్‌అండ్‌టీతో ఉన్న పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్ ముగింపు దశకు చేరనుంది.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు తొలిదశలో మొత్తం 69 కిలోమీటర్లు కవర్ చేసింది. దీన్ని రూ.22,000 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ప్రాజెక్టును ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రారంభించినప్పటికీ, తాజాగా ఆస్తులను పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుండటంతో, భవిష్యత్తులో మెట్రో సేవల పునర్వ్యవస్థీకరణకు అవకాశం ఏర్పడింది.
ఈ డెవలప్‌మెంట్‌తో మెట్రో విస్తరణ, టికెట్ ధరలు, సేవా సమయాలపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ కలుగనుంది. ప్రజల ప్రయాణానికి మరింత అనుకూల మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంది.