Hyderabad Glide Bomb: హైదరాబాద్‌లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ-హైదరాబాద్) వేదికగా దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబును తయారు చేశారు. దీనికి ‘గౌరవ్’ అని పేరు పెట్టారు. ఈ బాంబు అభివృద్ధి ప్రక్రియలో పూణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏఆర్‌డీఈ), అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు సహకారాన్ని అందించాయి. దాదాపు 1000 కిలోల బరువు ఉండే దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు ‘గౌరవ్’ను తాజాగా సుఖోయ్-30ఎంకేఐ యుద్ధవిమానం నుంచి జారవిడిచి టెస్ట్ చేశారు. ఏప్రిల్ 8 నుంచి 10 వరకు ఈ పరీక్షలు జరిగాయి. నిర్దేశిత 100 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అది అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. దీంతో ఈ బాంబును(Hyderabad Glide Bomb) భారత వాయుసేనకు అందించడానికి లైన్ క్లియర్ అయింది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ బాంబును తయారు చేయడం విశేషం.
గౌరవ్ ఎలా పనిచేస్తుంది ?
- దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు ‘గౌరవ్’ను గగన తలం (విమానం) నుంచి లక్ష్యం దిశగా జారవిడవాలి. దూరంలోని లక్ష్యాలను కూడా ఇది కచ్చితత్వంతో ఛేదించగలదు.
- గగనతలం(విమానం) నుంచి జారవిడిచాక.. గరిష్ఠంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ దిశగా ఈ బాంబు కచ్చితత్వంతో వెళ్లగలదు.
- విమానం నుంచి ఈ బాంబును జారవిడిచాక.. అది తనను తాను లక్ష్యం దిశగా నావిగేట్ చేసుకుంటుంది. ఈ బాంబులోని ఇనెర్షియల్ నావిగేషన్ సిస్టమ్ (ఐఎన్ఎస్), జీపీఎస్ సమాచారం ఇందుకు సహకారాన్ని అందిస్తుంది.
గ్లైడ్ బాంబు గురించి..
- సాధారణంగా విమానం నుంచి గ్రావిటీ బాంబులను జారవిడుస్తుంటారు. అవి కచ్చితంగా లక్ష్యాన్ని తాకలేవు. గ్లైడ్ బాంబులు మాత్రం కచ్చితత్వంతో లక్ష్యాన్ని తాకుతాయి. ఎందుకంటే వీటిలో నావిగేషన్ వ్యవస్థ ఉంటుంది.
- గ్లైడ్ బాంబు లక్ష్యం దిశగా ప్రయాణించే క్రమంలో తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి రెక్కలు ఉంటాయి. జీపీఎస్, నేవిగేషన్ సిగ్నల్స్ ఆధారంగా ఇది తన లక్ష్యం దిశగా వెళ్తుంది.
- శత్రువుల భూభాగానికి గరిష్ఠంగా 100 కి.మీ దూరంలో ఉండి కూడా యుద్ధ విమానం నుంచి ఈ బాంబులను జారవిడవవచ్చు. ఇవి వెళ్లి శత్రువుల భూభాగంలో పడి విధ్వంసాన్ని క్రియేట్ చేస్తాయి.