Jubilee Hills: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన జూబ్లీహిల్స్ (Jubilee Hills) అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ కేంద్రాల క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పిస్తున్నారు.
మందకొడిగా పోలింగ్ శాతం నమోదు
అధికారుల తాజా సమాచారం ప్రకారం.. సాయంత్రం 5 గంటల సమయానికి నియోజకవర్గ వ్యాప్తంగా 47.16 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల సరళిని పరిశీలిస్తే జూబ్లీహిల్స్‌లో పోలింగ్ శాతం ఎప్పుడూ 50 శాతానికి మించకపోవడం గమనార్హం. 2023లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా ఇక్కడ 47.58% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. ఈసారి కూడా పోలింగ్ శాతం మందకొడిగా నమోదు కావడంతో ఈ అంశం విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ప్రధాన పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
Also Read: Exit Polls: ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అంటే ఏమిటి?
58 మంది అభ్యర్థులు బరిలో
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 4.01 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఉప ఎన్నిక బరిలో రికార్డు స్థాయిలో 58 మంది అభ్యర్థులు పోటీ పడటం నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారి.
పటిష్ట భద్రతా ఏర్పాట్లు
పోలింగ్‌ను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. 407 పోలింగ్ కేంద్రాల్లో 226 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి, అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షణ చేపట్టారు. ఎన్నికల సామగ్రిని 407 కేంద్రాలకు పంపించడానికి 2060 మంది ఎన్నికల సిబ్బంది, 2000 మందికి పైగా పోలీసు సిబ్బంది భద్రతా విధులు నిర్వహించారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న నిర్వహించబడుతుంది. ఆ రోజు జూబ్లీహిల్స్ ప్రజాతీర్పు ఏమై ఉంటుందో.. ఏ అభ్యర్థిని, ఏ పార్టీని గెలిపిస్తారో స్పష్టమవుతుంది. ఈ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపనుంది.
